● అనుమతి లేకుండా బోరు వేస్తే చర్యలు
● అదనపు కలెక్టర్ పాండు హెచ్చరిక
సంగారెడ్డి: సంగారెడ్డి పట్టణంలోని తారా డిగ్రీ కళాశాల సమీపంలోని బైపాస్ వద్ద అనుమతి లేకుండా బోరు వేస్తున్న బోర్‌వెల్ వాహనాన్ని అధికారులు సీజ్ చేశారు. అనంతరం వాహనాన్ని తదుపరి చర్యల నిమిత్తం పట్టణ పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు. ఈ సందర్భంగా అనుమతి లేకుండా ఎవరూ బోర్లు వేయకూడదని అదనపు కలెక్టర్ పాండు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, తహసీల్దార్ జయరాం, పట్టణ సీఐ రామునాయుడు పాల్గొన్నారు.
నారాయణఖేడ్: అదుపుతప్పి ఆటో బోల్తా పడింది. వివరాలు ఇలా.. ఖేడ్ వైపు నుంచి నిజాంపేట వైపు వంటగ్యాస్ సిలిండర్ల లోడుతో వెళ్తున్న ట్రాలీ ఆటో శుక్రవారం ఖేడ్ మండలం వెంకటాపూర్ గ్రామ శివారులో టైరు పాడవ్వడంతో అదుపుతప్పి రోడ్డుపక్కకు దూసుకెళ్లి బోల్తాపడింది. డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. అటుగా వెళుతున్న వారు గమనించి ఆస్పత్రికి తరలించారు. ఆటోలోని సిలిండర్లు పేలకపోవడంతో ప్రమాదం తప్పింది.
సిద్దిపేటకమాన్: మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడిన వారికి సిద్దిపేట కోర్టు జరిమానాతో పాటు జైలుశిక్ష విధించింది. ట్రాఫిక్ సీఐ ముత్యంరాజు వివరాల ప్రకారం.. పట్టణంలో తమ సిబ్బందితో కలిసి కొన్ని రోజులుగా నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ వాహన తనిఖీల్లో మద్యం తాగి వాహనాలు నడుపుతూ 83 మంది పట్టుబడ్డారు. వీరిని సిద్దిపేట కోర్టులో హాజరుపర్చగా శుక్రవారం విచారణ జరిపిన న్యాయమూర్తి రూ.7,95,500 జరిమానా, వీరిలో ఒకరికి పది రోజులు, ఇద్దరికి ఐదు రోజులు, నలుగురికి మూడు రోజులు, మరో ఇద్దరికి రెండు రోజుల జైలు శిక్ష విధించారు. అలాగే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడుపుతూ పట్టుబడిన 18 మందికి రూ.90వేల జరిమానా విధించినట్లు సీఐ తెలిపారు. కాగా పట్టణానికి చెందిన వ్యక్తి డ్రంకెన్‌డ్రైవ్‌లో పట్టుబడగా కోర్టు అతడికి మూడు రోజుల జైలు శిక్ష విధించినట్లు టూటౌన్ సీఐ మురళి తెలిపారు.
కౌడిపల్లి(నర్సాపూర్): మతిస్థిమితం లేని మహిళ అదృశ్యమైన ఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ అమరేందర్‌రెడ్డి వివరాల ప్రకారం.. ముట్రాజ్‌పల్లి గ్రామానికి చెందిన తిమ్మాపురం లక్ష్మికి మతిస్థిమితం లేదు. దీంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చికిత్స చేయించారు. గురువారం రాత్రి ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేసి పడుకుంది. శుక్రవారం తెల్లవారు జామును లేచిచూడగా ఆమె కనిపించలేదు. పలుచోట్ల వెతికినా ఆచూకీ లభించకపోవడంతో కొడుకు సాయిరాం పోలీసులకు ఫిర్యాదు చేశారు.


