మూగజీవాల దాహార్తి తీరేదెలా? | - | Sakshi
Sakshi News home page

మూగజీవాల దాహార్తి తీరేదెలా?

Oct 30 2026 7:30 AM | Updated on Oct 30 2026 7:30 AM

కొల్చారం(నర్సాపూర్‌): ఈసారి వర్షాలు అంతంతగానే కురవడం, మరోవైపు ఎల్‌ నినో ప్రభావంతో మండుతున్న ఎండలు.. ఫలితంగా చెరువుల్లో కనిష్ట స్థాయికి పడిపోయిన నీటిమట్టం.. కుంటలు ఎండు ముఖం పట్టడంతొ నీటి వనరులపై తీవ్ర ప్రభావం కనిపిస్తోంది. వచ్చేది ఎండాకాలం తాగునీటి కోసం అల్లాడే పరిస్థితి. మానవులు తమ నీటి అవసరాలను ఎలాగోలా తీర్చుకుంటుండగా, మూగజీవాల పరిస్థితి ఎలా అనేది సందేహంగా మారింది.

నిరుపయోగంగా నీటి తొట్లు

కొల్చారం మండలంలో 21 గ్రామ పంచాయతీల పరిధిలో 5,875 పశువులు, 9,631 గొర్రెలు, 4,776 మేకలతో పాటు ఇతర జంతువులు కలిసి 15,700 ఉన్నాయి. గతంలో మండలంలోని గ్రామాల్లో మూగజీవాల దాహార్తిని తీర్చేందుకు గ్రామాల్లో ఒకటి నుంచి రెండు వరకు ఉపాధి హామీ పథకం కింద 50 వరకు నీటి తొట్లను నిర్మించి, కుళాయిల ద్వారా నీటిని అందించారు. వీటితో పశువులకు దాహం తీర్చేందుకు ఉపయోగకరంగా మారాయి. కొన్నేళ్ల నుంచి వాటి నిర్వహణ పట్టించుకోకపోవడం ప్రస్తుతం అవి కాస్త నిరుపయోగంగా మారాయి. గ్రామాల్లో ఎక్కడ చూసినా నీటితోట్ల చుట్టూ పిచ్చి మొక్కలు పెరిగి, ఎక్కడికక్కడా బీటలు వారీ కనిపిస్తున్నాయి. మరి కొన్ని చోట్ల వాటి ఆనవాళ్లు కానరాకుండా పోయాయి. నీటి తొట్లను నిర్మించి గ్రామపంచాయతీలకు వాటి నిర్వహణ అప్పగించడం, ప్రస్తుతం వాటిని పట్టించుకోకపోవడం ఇబ్బందికరంగా తయారైంది. మూగజీవాలకు నీటిని తాగించాలంటే కాపర్లు సుదూర ప్రాంతాలకు వెతుక్కుంటూ పోవాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అటు మంజీరా పూర్తిగా అడుగంటడం, తీర ప్రాంత గ్రామాల్లోని మూగజీవాలకు నీటి కొరత మరింత జఠిలంగా తయారైంది. అధికారులు నీటి తొట్లపై వెంటనే స్పందించి మరమ్మతులు చేపట్టడం, అవసరమైతే కొత్త వాటి నిర్మించి నీటి సౌకర్యం కల్పించి, మూగజీవాల దాహార్తి తీర్చాల్సిన అవసరం ఉంది.

ముంచుకొస్తున్న ఎల్‌నినో

చెరువులు కుంటల్లో అడుగంటుతున్న నీరు

నీటి తొట్ల ఏర్పాటుపై తాత్సారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement