తూప్రాన్: చెరువులో మునిగి మృతి చెందిన సుబ్రహ్మణ్యం అలియాస్ మున్నా మృతికి కారణమైన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని కోరుతూ కుటుంబ సభ్యులు గురువారం ఆందోళనకు దిగారు. నిందితుడిగా ఆరోపిస్తున్న స్వర్గల ప్రవీణ్ ఇంటి ముందు మృతదేహాన్ని ఉంచి నిరసన తెలపడంతో పట్టణంలోని ఎస్సీ కాలనీలో ఉద్రిక్తత నెలకొంది. పట్టణ సమీపంలోని పెద్ద చెరువులో బుధవారం సుబ్రహ్మణ్యం మృతి చెందిన విషయం తెలిసిందే. విషయం తెలుసుకున్న ఎస్ఐ గంగరాజు పోలీసు సిబ్బందితో అక్కడికి చేరుకుని బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించవద్దని, చట్టప్రకారం న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. సుబ్రహ్మణ్యం మృతికి కారణమైన వ్యక్తిని శిక్షించడంతో పాటు, మృతుడి తల్లికి పరిహారం అందించాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. దీంతో కాలనీ పెద్దలు జోక్యం చేసుకుని రెండు మూడు రోజుల్లో నిందితుడి కుటుంబ సభ్యులతో మాట్లాడి పరిహారం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. దీంతో బాధితులు ఆందోళన విరమించారు. అనంతరం మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించడంతో పరిస్థితి సద్దుమణిగింది.
ఇద్దరు నిందితులు అరెస్ట్
పట్టణ సమీపంలోని పెద్ద చెరువులో మునిగి సుబ్రహ్మణ్యం అలియాస్ మున్నా మృతి చెందిన కేసులో ప్రవీణ్, చైతన్య అనే ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ గంగరాజు గురువారం తెలిపారు. మృతుడి తల్లి కళ్లెం శ్యామల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు చెప్పారు. దర్యాప్తులో సుబ్రహ్మణ్యానికి ప్రవీణ్, చైతన్యలతో గొడవ జరిగినట్లు గుర్తించామన్నారు. దీంతో వారిని అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ వెల్లడించారు. ఈ సమావేశంలో ఎస్ఐ యాదగిరి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
న్యాయం చేయాలని కుటుంబ సభ్యుల డిమాండ్


