సిద్దిపేటకమాన్: రాఘవాపూర్ కేజీబీవీలో పదో తరగతి చదువుతున్న విద్యార్థిని లాస్య (15) అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం జిల్లాలో కలకలం రేపింది. సిబ్బంది నిర్లక్ష్యం వల్లే విద్యార్థిని మృతి చెందిందని ఆరోపిస్తూ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి, మాజీ ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యతో కలిసి బాధిత కుటుంబ సభ్యులు, విద్యార్థి, దళిత సంఘాల నాయకులు సిద్దిపేట ప్రభుత్వాస్పత్రి మార్చురీ వద్ద ఆందోళనకు దిగారు. బాధిత కుటుంబ సభ్యులకు న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించే ప్రసక్తే లేదని పట్టుబట్టారు. ఆందోళన చేస్తున్న విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థిని రెండు రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతుంటే ఎవరూ పట్టించుకోలేదన్నారు. ప్రభుత్వ వైఫల్యంతోనే ఈ ఘటన చోటు చేసుకుందని విమర్శించారు. హాస్టల్ వార్డెన్, సిబ్బందిపై అనుమానం ఉందన్నారు. ఘటనపై పూర్తిస్థాయి విచారణ చేపట్టి బాధ్యులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి రూ. 20 లక్షల పరిహారం అందించాలని, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలన్నారు. అనంతరం ఎమ్మెల్యే విద్యార్థిని తల్లిదండ్రులతో కలెక్టరేట్‌కు వెళ్లి కలెక్టర్‌తో చర్చించారు. అనంతరం ఎమ్మెల్యే రూ. 20 వేల ఆర్థిక సాయం బాలిక కుటుంబ సభ్యులకు అందజేశారు. పోస్టుమార్టం అనంతరం బాలిక మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. అడిషనల్ డీసీపీ కుశాల్కర్ పరిస్థితిని పరిశీలించారు. పోలీసు సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
న్యాయం చేయాలని విద్యార్థి సంఘాల డిమాండ్
ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి, బాధిత కుటుంబ సభ్యులతో చర్చలు జరిపిన కలెక్టర్


