ఈఎన్‌సీ రమేశ్‌బాబు
పుల్‌కల్(అందోల్): రాబోయే రోజుల్లో భారీ వర్షాలు కురిసి వరదలు వస్తే, తాగునీటి అవసరాల కోసం సింగూరు డ్యాంలో నీటిని పెద్ద ఎత్తున నిల్వ చేయాలని రాష్ట్ర నీటిపారుదలశాఖ ఈఎన్‌సీ రమేశ్‌బాబు ప్రాజెక్టు ఇంజినీర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. శనివారం ఆయన మిషన్ భగీరథ, జంట నగరాల తాగునీటి సరఫరా అధికారులతో కలిసి సింగూరు ప్రాజెక్టును సందర్శించి, ప్రస్తుతం ఉన్న నీటి నిల్వలపై సమగ్రంగా ఆరా తీశారు. సింగూరు డ్యాం భద్రత అధికారుల సూచనల మేరకు, రాతికట్ట మరమ్మతుల కోసం గతేడాది కాలంగా డ్యాంలో నీటి నిల్వలను తగ్గించారు. మొత్తం 29.91 టీఎంసీల పూర్తి నీటి నిల్వ సామర్థ్యం ఉన్న ఈ డ్యాంలో కేవలం 7 టీఎంసీల మాత్రమే ఉంచి మరమ్మతులు చేపట్టగా, ప్రస్తుతం 4.52 టీఎంసీల నీరు మాత్రమే అందుబాటులో ఉంది. ప్రస్తుతం కట్ట మరమ్మతుపనులు తుది దశకు చేరుకోవడంతో ఇప్పటి నుంచి కురిసే ప్రతి వర్షపు చుక్కనూ డ్యాంలోనే భద్రపరచాలని ఈఎన్‌సీ సూచించారు. మిగిలిన చిన్నపాటి పనులను కూడా త్వరితగతిన పూర్తి చేయాలని కాంట్రాక్టరును, సంబంధిత అధికారులను ఆదేశించారు. సింగూరు డ్యాం ఆధారంగా జంట నగరాలతో పాటు సంగారెడ్డి, కామారెడ్డి, మెదక్ జిల్లాలకు మిషన్ భగీరథ ద్వారా తాగునీటిని సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న నీటి నిల్వలు రాబోయే వేసవి అవసరాలకు ఏమాత్రం సరిపోవని, అందుకే ప్రాజెక్టులోకి వచ్చే వరద నీటిని గరిష్టంగా నిల్వ చేసుకోవడం అత్యంత కీలకమని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా డ్యాం వద్ద జరుగుతున్న రాతికట్ట పనులను, కాల్వల సీసీ పనులను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. కార్యక్రమంలో నీటిపారుదలశాఖ సీఈ విద్యావతి, ఎస్‌ఈ యశశ్విని, ఈఈ భీమ్, మిషన్ భగీరథ ఈఈ నాగభూషణం, హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ ఈఈ రామకృష్ణ, డీఈఈ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.


