సాధారణం కంటే తక్కువగా కురిసిన వర్షం
● 16 మండలాల్లో నమోదు
● పంట ఎదుగుదలపై వర్ష ప్రభావం
● తగ్గుతున్న భూగర్భ జలాలు
సంగారెడ్డి జోన్: ఎల్‌నినో ప్రభావంతో జిల్లాలో లోటు వర్షపాతం నమోదైంది. ఈ సంవత్సరం వానాకాలం సీజన్ ప్రారంభం నుంచి ఇప్పటివరకు 16% వర్షం తక్కువ కురిసినట్లు వాతావరణ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. సుమారు గత 20 రోజులుగా వరుణుడు ముఖం చాటేయడంతో పంటలు సాగు చేసిన రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. జూన్, జూలైలో సాధారణం కంటే ఎక్కువగా వర్షం కురిసిన ఆగస్టు నెలలో లోటు వర్షపాతం నమోదైంది. పంట ఎదిగే సమయంలో వర్షాలు కురువకపోవడంతో రైతులు ఆకాశం వైపు దిక్కులు చూస్తున్నారు.
తగ్గిన సాగు విస్తీర్ణం
జిల్లాలో ఏడు లక్షల అరవై వేల ఎకరాల విస్తీర్ణంలో ఈ సీజన్‌లో పంటలు సాగవుతాయని అధికారులు అంచనా వేశారు. ఈ ఏడాది వర్షాలు సరిగ్గా కురవకపోవడంతో సుమారు 60వేల ఎకరాల మేర సాగు విస్తీర్ణం తక్కువగా ఉండొచ్చని అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా పంట సాగు వివరాలు నమోదు చేస్తున్నారు. ఈ నెల చివరి వరకు ఎంతమేర పంట సాగైందో తెలిసే అవకాశాలున్నాయి. అత్యధికంగా పత్తి, వరి, చెరుకు పంటలు సాగులో ఉన్నాయి. ప్రస్తుతం పత్తి పంట పూత, కాత దశలో ఉన్నాయి. సోయా కాత దశలో ఉంది. ఈ సమయంలో వర్షాలు లేకపోవడంతో పంట ఎదుగుదలపై ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయని రైతులు చెబుతున్నారు. చాలాచోట్ల పత్తి పంట తక్కువ ఎత్తులో ఉండగా, సోయాబీన్ పంట ఎండు ముఖం పట్టింది.
16 మండలాల్లో లోటు వర్షపాతం
జిల్లావ్యాప్తంగా 28 మండలాలుండగా 16 మండలాల్లో సాధారణం కంటే తక్కువగా నమోదైంది. రెండు మండలాల్లో అత్యధికంగా 10 మండలాల్లో సాధారణ వర్షం కురిసింది. జిల్లావ్యాప్తంగా జూన్, జూలైలో సాధారణం కంటే 12% ఎక్కువగా కురిసింది. ఆగస్టు నెలలో 56% తక్కువగా నమోదైంది. ప్రస్తుత నెలలో పది రోజులు పూర్తయినప్పటికీ చినుకు జాడ లేకుండా పోయింది. సీజన్ మొదటి రెండు నెలలు సాధారణం కంటే 12% అదనంగా ఉన్న వర్షపాతం ఆగస్టులో ఏకంగా 56% తక్కువగా కురిసి లోటు వర్షపాతం నమోదైంది. ఫలితంగా జిల్లావ్యాప్తంగా ఉన్న చెరువులు, ప్రాజెక్టులు, చెక్ డ్యామ్‌లు నీరు లేక కళావిహీనంగా మారాయి.
నాలుగు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం
శనివారం నుంచి మరో నాలుగు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశముందని సంబంధిత శాఖ అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. అల్పపీడన ప్రభావంతో ఈ నెల 14 వరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని సమాచారం. ఈ ప్రకటన మేరకు జిల్లా వ్యాప్తంగా ఉరుములతో కూడిన మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. వర్షాలపై ఆధారపడి పంటలు సాగు చేసిన రైతులకు ఈ వర్షాలు ఊరట కలిగించనున్నాయి. ఒకవేళ ఆశిస్తున్నట్లుగా ఈ నెలలో వర్షాలు కురవకపోతే పంటలు పూర్తిగా ఎండిపోయి, పెట్టుబడులు రావడం కూడా కష్టమేనని రైతులు ఆవేదన చెందుతున్నారు.
పడిపోతున్న భూగర్భ జలాలు
వర్షాభావంతో జిల్లాలో భూగర్భ జలాలు పడిపోతున్నాయి. అధికారులు చెప్పినట్లుగా ఆగస్టు పూర్తయ్యేసరికి 11.22 మీటర్ల లోతులో జలం లభిస్తోంది. వట్టిపల్లి మండలంలో 3.32మీటర్ల లోతులో నీరు ఉండగా గుమ్మడిదల మండలంలో 18.15 మీటర్ల లోతులోకి పడిపోయింది. అందోల్, హత్నూర, ఝరాసంగం, జిన్నారం, కంగ్టి, కల్హేర్, కంది, కోహీర్, నిజాంపేట, పుల్కల్ మండలాల్లో గ్రౌండ్ వాటర్ లెవెల్ పడిపోతున్నాయి. సంగారెడ్డి, గుమ్మడిదల, పటాన్‌చెరు మండలాల్లో 16.5 మీటర్ల లోతులో ఉండి ప్రమాదకర స్థితిలో ఉన్నాయి. మిగతా మండలాల్లో సాధారణ పరిస్థితుల్లో ఉన్నాయి.
ఆరుతడి పంటలకు ఇబ్బందులే
జిల్లాలో నమోదైన వర్షపాతానికి ఆరుతడి పంటలు సాగు కూడా కష్టమేనని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సోయాబీన్, మినుము, పెసర పంటలకు ప్రస్తుతం వర్షం ఎంతో ముఖ్యం. నీరు లేక ఎండుముఖం పడుతున్నాయి. సాగు చేసిన పంటలను కాపాడుకునేందుకు రైతులు ప్రత్యామ్నాయ మార్గాలకు సిద్ధమవుతున్నారు. నీటి సౌకర్యం ఉన్నవారు పైప్ లైన్‌తోపాటు స్ప్రింకర్ ద్వారా నీటిని అందించేందుకు కసరత్తు చేస్తున్నారు.


