● టీజీఐసీసీ చైర్‌పర్సన్ నిర్మలారెడ్డి
● సంగారెడ్డిలో కాంగ్రెస్ నిరసన
సంగారెడ్డి: అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వ్యవహరించిన తీరుపై ఆ పార్టీకి ప్రజలే బుద్ధి చెబుతారని టీజీఐసీసీ చైర్‌పర్సన్ నిర్మలారెడ్డి వ్యాఖ్యానించారు. బీఆర్‌ఎస్ నాయకుల తీరును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ శ్రేణులు సంగారెడ్డిలో నిరసన నిర్వహించారు. రామ్‌నగర్‌లోని జగ్గారెడ్డి నివాసం నుంచి పాతబస్టాండ్‌లోని అంబేడ్కర్ చౌరస్తా వరకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేడ్కర్ విగ్రహానికి నిర్మలారెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నిర్మలారెడ్డి మాట్లాడుతూ..అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అరాచకం, గూండాయిజానికి పాల్పడ్డారన్నారు. అసెంబ్లీలో ప్రజాసమస్యలపై మాట్లాడాల్సిన ప్రజాప్రతినిధులు అందుకు భిన్నంగా వ్యవహరించడం దారుణమని చెప్పారు. బీఆర్‌ఎస్ నేతలు తమకు తామే నెట్టుకుని, పోలీసులపై దాడి చేసి, తిరిగి తామే బాధితులమన్నట్లుగా వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. దళిత వర్గాన్ని అవమానించేలా బీఆర్‌ఎస్ నేతలు చేసిన వ్యాఖ్యలు, చర్యలను రాష్ట్ర ప్రజలంతా గమనించారని పేర్కొన్నారు. దళితులు నడిచిన నేలను పసుపు నీళ్లతో శుద్ధి చేయడం బీఆర్‌ఎస్ పార్టీ కుసంస్కారానికి, అనాగరిక చర్యలకు నిదర్శనమని మండిపడ్డారు. నిరసన కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజీ అనంత్ కిషన్, మున్సిపల్ చైర్‌పర్సన్ కూన వనిత, సీడీసీ చైర్మన్ రామ్‌రెడ్డి, నాయకులు జార్జ్, కిరణ్‌గౌడ్, సంతోశ్, శ్రీకాంత్, రామ్‌చందర్‌నాయక్, శ్రీకాంత్‌రెడ్డి, సందీప్‌రెడ్డి, భూమేశ్, తదితరులు పాల్గొన్నారు.
జాతీయ రహదారి పనుల పరిశీలన
నారాయణఖేడ్: నిజాంపేట్– నారాయణఖేడ్– బీదర్ 161బీ జాతీయ రహదారిపై మంజీరా నదిపై పుల్‌కుర్తి–రాఘవాపూర్‌ల మధ్య నిర్మాణంలో ఉన్న వంతెన పనులను శుక్రవారం నేషనల్ హైవే క్వాలిటీ కన్సల్టెంట్ అధికారులు బృందం పరిశీలించింది. ఈ రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం రూ.303 కోట్లు విడుదల చేసింది. నిజాంపేట్ నుంచి బీదర్ వరకు ఖేడ్ మీదుగా 46 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం, అభివృద్ధి పనులు చేపట్టింది. ఇప్పటివరకు 70% పనులు పూర్తి కాగా మంజీరా నదిపై వంతెన నిర్మాణం పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ మేరకు వంతెన నిర్మాణపు పనులను నేషనల్ హైవే డిప్యూటీ ఈఈ సందీప్, ఏఈ భానుప్రకాష్, క్వాలిటీ కన్సల్టెంట్ అధికారి శ్రీనివాస్‌రెడ్డి బృందం, ఆర్‌ఎంఎన్‌జీఎం నాగరాజు తదితరులు పరిశీలించారు. ఈ సందర్భంగా డిప్యూటీ ఈఈ సందీప్ మాట్లాడుతూ...ఈ రోడ్డు నిర్మాణ పనులు మరో ఆరు నెలల్లో పూర్తవుతాయన్నారు. జరుగుతున్న పనుల నాణ్యత పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు.


