డీఎస్పీ సత్తయ్య గౌడ్
సంగారెడ్డి టౌన్/ సంగారెడ్డి క్రైమ్: వినాయక చవితి వేడుకలు ప్రశాంతంగా జరిగేలా గణేశ్ ఉత్సవ సమితి సభ్యులు, ప్రజలు సహకరించాలని సంగారెడ్డి డీఎస్పీ సత్తయ్య గౌడ్ కోరారు. ఈ నెల 14న వినాయక చవితి పురస్కరించుకుని ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. పట్టణంలో ఈసారి ఇప్పటివరకు 200 పైగా మండపాల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నట్లు చెప్పారు. పోలీస్ పోర్టల్‌లో మండప నిర్వాహకులు తప్పకుండా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని సూచించారు. ప్రతీ మండపం వద్ద ఉత్సవ సమితి సభ్యులు సీసీ కెమెరాలను తప్పకుండా బిగించుకోవాలి వినాయక మండపాల వద్ద అన్నదానం చేసేటప్పుడు రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మండపాల వద్ద డీజేలకు అనుమతి లేదని, స్పీకర్లను మాత్రమే పెట్టాలని స్పష్టం చేశారు. స్పీకర్లను రాత్రి 10 గంటల తర్వాత బంద్ చేయాలని చెప్పారు.
అసెంబ్లీలో ఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి
నారాయణఖేడ్: వ్యవసాయ, పశుసంపద ఆధారంగా ఆగ్రోబేస్డ్, డెయిరీ బేస్డ్ పరిశ్రమలను ఖేడ్ ప్రాంతంలో ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే సంజీవరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం ఆయన అసెంబ్లీలో జీరో అవర్‌లో మాట్లాడుతూ..ఆయా పరిశ్రమల ద్వారా స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరగడంతోపాటు రైతులు తమ వ్యవసాయ, పాడి ఉత్పత్తులకు మెరుగైన మార్కెట్ సదుపాయాలు పొందే అవకాశం ఉంటుందన్నారు. పాడిరైతులకు సైతం ప్రోత్సాహం అందిస్తే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేత మవుతుందన్నారు. ఖేడ్ నియోజకవర్గ రైతులు, పశుపోషకుల సమస్యలను ప్రభుత్వం ప్రత్యేకంగా పరిగణలోకి తీసుకుని పశువైద్యుల నియామకం, సంచార అంబులెన్స్‌ల పెంపు, పశుపోషణకు రాయితీలు, ఆగ్రో, డెయిరీ ఆధారిత పరిశ్రమలను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఐఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు నరసింహారెడ్డి
పటాన్‌చెరు టౌన్: సింఫనీ హోమ్స్ కాలనీలో 22–ఏ నిషేధిత జాబితాపై నెలకొన్న సందేహాలను నివృతి చేసి, ప్రభుత్వ భూమిని కాపాడాలని ఐఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు నరసింహారెడ్డి కోరారు. తహసీల్దార్ కార్యాలయంలో శుక్రవారం డిప్యూటీ తహసీల్దార్ శేఖర్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...జేపీ కాలనీ డివిజన్ పరిధిలోని సింఫనీ హోమ్స్‌లో 55 ఎకరాల్లో సుమారు 900 విల్లాలున్నాయని, 5 వేల మంది నివసిస్తున్నారని తెలిపారు. 22–ఏ లో మొత్తం కాలనీని చేర్చారంటూ మాజీ మంత్రి హరీశ్‌రావు చేసిన వ్యాఖ్యలు ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయని అన్నారు. తహసీల్దార్ వివరాల ప్రకారం..రైల్వే లైన్ కోసం సేకరించిన సుమారు 4.15 ఎకరాల ప్రభుత్వ భూమిని మాత్రమే 22–ఏ లో చేర్చినట్లు తెలిపారు. ఆ స్థలాన్ని రక్షించాల్సిన బాధ్యత ఎంపీ రఘునందన్‌రావుపై ఉందన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మతిన్, యువరాజ్, రాజు, సాయిలు, అక్షిత్ తదితరులు పాల్గొన్నారు.
సంగారెడ్డి: సంగారెడ్డి పోస్టల్ డివిజన్ నూతన సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్స్‌గా బి. అంబేడ్కర్ రాజు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేసిన డి. శ్రీహరి బదిలీపై హైదరాబాద్ వెళ్లారు. ఆయన స్థానంలో అంబేడ్కర్ రాజు బాధ్యతలు చేపట్టారు.


