ఆత్మహత్యలు వద్దు.. ఆలోచించండి
సంగారెడ్డి క్రైమ్: చదువు భారమని.. ఉద్యోగం రాలేదని.. ప్రేమ విఫలమైందని కొందరు, అప్పులు తీర్చలేక.. భర్త అనుమానించాడని భార్య.. తల్లిదండ్రులు మందలించారని పిల్లలు.. లవ్ ఫెయిల్ తదితర కారణాలతో క్షణికావేశంలో బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. కన్నవారికి, తమ కుటుంబానికి కడుపుకోత మిగులుస్తున్నారు. ఇలా జిల్లాలో ఎక్కడో ఒకచోట ఆత్మహత్యకు పాల్పడుతూనే ఉన్నారు.
జీవితం చాలా విలువైనది. ప్రతి మనిషికి ఏదో ఒక సమస్య ఉంటుంది. ఆ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో ఆలోచించాలి. ఏ సమస్యకై నా ఆత్మహత్య పరిష్కారం కాదని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. జిల్లాలో ఏటా ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారి సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
ఇలా అరికట్టవచ్చు
వైద్యనిపుణుల విశ్లేషణ ప్రకారం... ఆత్మహత్యకు పాల్పడాలనుకునేవారు ఒంటరిగా ఉంటారు. వెంటనే వారిని గుర్తించి కౌన్సిలింగ్ ఇవ్వొచ్చు. డయల్ 100కు కాల్ చేస్తే పోలీసులు స్పందిస్తారు. మహిళల కోసం 181కు కాల్ చేస్తే సఖి కేంద్రం సిబ్బంది ఇంటికొచ్చి కౌన్సిలింగ్ ఇస్తారు. పిల్లలకై తే 1098కి సమాచారం ఇవ్వాలి.
పరిష్కార మార్గాలు
తమ కుటుంబ సభ్యులతో లేదా స్నేహితులతో చర్చిస్తే పరిష్కార మార్గాలు లభిస్తాయి. కానీ అవేమీ ఆలోచించకుండా చాలామంది చావు మార్గాన్ని ఎంచుకుంటున్నారు. దీంతో వారి జీవితం అర్ధాంతరంగా ముగిసిపోతుంది. వారిపై ఆధారపడ్డ పిల్లలు, తల్లిదండ్రులు రోడ్డున పడుతున్నారు.
ఎవరైనా తాను బతకనని, కుటుంబానికి బరువయ్యానని చెబితే తేలికగా తీసుకోవద్దు.
నేను లేని ఇంటిని, జీవితాన్ని ఊహించుకోండి అంటూ చాలా మంది మానసిక వేదన వెలిబుచ్చుతారు. వారిని మార్చే దిశగా ప్రయత్నం చేయకపోతే కోల్పోయే ప్రమాదం ఉంది.
వ్యాయామం అలవాటు చేయడం ద్వారా కొంత మార్పు ఉంటుంది.
కొన్ని ఘటనలు..
సంగారెడ్డి పట్టణంలోని ఓ ప్రైవేటు హాస్టల్‌లో యువతి ఆగస్టు 23న ఆత్మహత్య చేసుకుంది. మనోవేదనతో క్షణికావేశంలో మత్తు ఇంజక్షన్ తీసుకొని బలవన్మరణానికి పాల్పడింది.
పుల్కల్ మండలానికి చెందిన యువకుడు కడుపు నొప్పి తట్టుకోలేక జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్నాడు.


