● బ్రాహ్మణపల్లి రైల్వేగేట్ వద్ద ఫ్లైఓవర్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్
● ఎంపీ రఘునందన్‌రావుకు కృతజ్ఞతలు
తూప్రాన్ /శివ్వంపేట: తూప్రాన్ పట్టణ పరిధిలోని బ్రాహ్మణపల్లి రైల్వేగేట్ వద్ద ట్రాఫిక్ కష్టాలకు త్వరలోనే శాశ్వత పరిష్కారం లభించనుంది. అక్కడ రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్‌ఓబీ) నిర్మాణానికి దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ సానుకూలంగా స్పందించారు. ఈ రైల్వే గేట్ వద్ద నిత్యం వాహనాలు నిలిచిపోయి ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులను, అలాగే అక్కన్నపేట రైల్వే స్టేషన్‌లో అజంతా ఎక్స్‌ప్రెస్‌కు స్టాపేజీ ఏర్పాటు చేయాల్సిన అవసరంపై వివరిస్తూ మెదక్ ఎంపీ రఘునందన్‌రావు రైల్వే జనరల్ మేనేజర్‌ను బుధవారం కలిసి సమగ్ర నివేదిక సమర్పించారు. ఎంపీ అభ్యర్థనపై స్పందించిన రైల్వే జీఎం 10 రోజుల్లోనే డిటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్) సిద్ధం చేసి, మంజూరు ప్రక్రియను అధికారికంగా ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. ఈ ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తయితే తూప్రాన్–నర్సాపూర్ రహదారిపై ప్రయాణించే వాహనదారుల ట్రాఫిక్ ఇబ్బందులు తొలగిపోతాయి. దీంతో ఎంపీకి బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేశ్‌గౌడ్, తూప్రాన్ మున్సిపల్ అధ్యక్షుడు జానకిరామ్‌గౌడ్, ప్రజల తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
సిద్దిపేట వాసికి డాక్టరేట్
సిద్దిపేటజోన్: సిద్దిపేటకు చెందిన డాక్టర్ బలరాంకు ఉస్మానియా యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. హైబ్రిడ్ పునరుత్పాదక ఇంధన వనరులను మైక్రో గ్రిడ్ పవర్ సిస్టంలో సమర్థవంతంగా అనుసంధానం చేయడం, హార్మోనిక్స్ తగ్గించడం, విద్యుత్ వ్యవస్థలో సమతుల్యత మార్పిడి తదితర అంశాలపై చేసిన పరిశోధనకు డాక్టరేట్ లభించింది. రాష్ట్ర గవర్నర్ శుక్లా ఆయనకు డాక్టరేట్‌ను అందజేశారు. ఈ సందర్భంగా పలువురు బలరాం ను అభినందించారు.
బీడీ కార్మికులకు జీవన భృతి చెల్లించాలి
మిరుదొడ్డి(దుబ్బాక): బీడీ కార్మికులకు ప్రభుత్వం వెంటనే రూ. 4,016 జీవన భృతి చెల్లించాలని సీఐటీయూ బీడీ సిగార్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మద్దెల అంజయ్య కోరారు. బుధవారం మిరుదొడ్డి ఎంపీడీఓ వినోద్ కుమార్, ఇన్‌చార్జి ఎంపీఓ ఫహీంకు వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీడీ పరిశ్రమల్లో పని రోజులు తగ్గిపోవడంతో పాటు, పెరిగిపోతున్న నిత్యావసర ధరల కారణంగా కార్మికుల కుటుంబాలు దుర్భర జీవితాలు అనుభవిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే జీవన భృతిని అమలు చేయాలని కోరారు.
కేసీఆర్‌పై వ్యాఖ్యలకు నిరసనగా..
సమావేశం బైకాట్
సిద్దిపేటరూరల్: మాజీ సీఎం కేసీఆర్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలకు నిరసనగా మండల సర్పంచ్‌లు సమావేశంను బైకాట్ చేశారు. బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో అభివృద్ధి పనులు, సమస్యల పరిష్కారం కోసం మండల ప్రత్యేకాధికారి ప్రియాంక అధ్యక్షతన సాధారణ సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. కాగా 10 గంటలు దాటినా సభ్యులు ఎవరూ రాలేదు. దీంతో ప్రత్యేకాధికారి ప్రియాంక, మండల స్థాయి అధికారులు సీట్లలో కూర్చొని సుమారు రెండు గంటల పాటు వేచి చూశారు. తీరా సర్పంచ్‌లు కార్యాలయం వద్దకు వచ్చినా లోపలికి రాలేదు. మాజీ సీఎం కేసీఆర్ మరణాన్ని కోరుకుంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ, అతనిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సమావేశాన్ని బైకాట్ చేశారు. అనంతరం రూరల్ పోలీస్‌స్టేషన్ ఎస్‌ఐ నవతకు ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి, సర్పంచ్‌లు పద్మ శ్రీనివాస్, మమతరాజు, తిరుపతి, పద్మాదేవి, బాల్‌రాజు ఉన్నారు.


