● భారతీయ కిసాన్ సంఘ్ ● విద్యుత్ శాఖ ఎస్‌ఈకి వినతి పత్రం అందజేత
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): రైతులకు 18 గంటల పాటు నిరంతర విద్యుత్‌ను అందించాలని, భారతీయ కిసాన్ సంఘ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకట్‌రెడ్డి, జిల్లా అఽధ్యక్షుడు జశ్వంత్‌రెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల నుంచి జిల్లా విద్యుత్ భవన్ వరకు భారతీయ కిసాన్ సంఘ్ నాయకులు, కార్యకర్తలు, రైతులు ర్యాలీ నిర్వహించి, జిల్లా విద్యుత్ శాఖ ఎస్‌ఈకి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రస్తుతం 10 గంటలు మాత్రమే విద్యుత్ ఇవ్వడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, పంటను కాపాడాలంటే సరఫరాను వెంటనే పెంచాలని కోరారు. సిద్దిపేట చుట్టుపక్కల కాల్వలు ఉన్నప్పటికీ చెరువుల్లోకి సాగునీరు రాకపోవడం దురదృష్టకరమని, వర్షాభావ పరిస్థితుల్లో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. రైతుల పంటలను కాపాడేందుకు ప్రభుత్వం వెంటనే అందుబాటులో ఉన్న నీటి వనరులతో చెరువులు, కుంటలను నింపేలా చర్యలు చేపట్టాలని కోరారు. వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో పలు గ్రామాల్లో ఐదు నుంచి ఆరు గంటలు సక్రమంగా విద్యుత్ అందడం లేదని ఆరోపించారు. రైతులు ఇప్పటికే పంటల సాగు కోసం పెట్టుబడులు పెట్టారని, విద్యుత్ సరఫరాలో అంతరాయాల కారణంగా పంటలకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. ప్రభుత్వం స్పందించి విద్యుత్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని కోరారు.


