‘సర్‌’ నోటీసులపై గుబులు | - | Sakshi
Sakshi News home page

‘సర్‌’ నోటీసులపై గుబులు

Sep 9 2026 12:03 PM | Updated on Sep 9 2026 12:03 PM

16 వరకు అభ్యంతరాల స్వీకరణ

జిల్లాలో మ్యాపింగ్‌ కానివి, అనామలిస్‌ జాబితాలోని నోటీసుల వివరాలు

ఇంకా పూర్తికాని పంపిణీ ప్రక్రియ

బూత్‌ల వారీగా ఓటర్ల వివరాలు సేకరణ

అభ్యంతరాల స్వీకరణకు స్పెషల్‌ డ్రైవ్‌

నోటీసుల జారీలో అధికారుల నిర్లక్ష్యం

సంగారెడ్డి జోన్‌: సమగ్ర ఓటరు జాబితా రూపొందించేందుకు భారత ఎన్నికల సంఘం జూన్‌ 25న స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌(సర్‌) ప్రక్రియ చేపట్టింది. అందుబాటులోకి వచ్చిన సాంకేతిక పరిజ్ఞానంతో ఓటర్లు తీవ్రస్థాయిలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రక్రియ ప్రారంభమైన నాటి నుంచి నేటి వరకు తిప్పలు తప్పడం లేదని ఆందోళన చెందుతున్నారు. 2002 జాబితా ఆధారంగా 2025 జాబితాను అనుసంధానం చేసుకుంటూ ఎన్యూమరేషన్‌ ఫారాలు పూర్తి చేసి అందించారు. గత నెల 17న ముసాయిదా ఓటరు జాబితాను విడుదల చేశారు. జాబితాలో ఉన్న ఓటర్ల వివరాలతో గత ఓటరు జాబితాకు తేడాలు ఉండటంతో సంబంధిత ఓటర్లకు నోటీసులు జారీ చేస్తున్నారు. దీంతో ఓటర్లు ఆందోళనకు గురవుతున్నారు.

4 లక్షల 60 వేల మందికి నోటీసులు

జిల్లా వ్యాప్తంగా ఓటరు జాబితాకు మ్యాపింగ్‌ కాని వారితో పాటు ముసాయిదా జాబితాలో ఉన్న వివిధ రకాల తేడాలు, చిన్నపాటి పొరపాట్లు ఉన్న వారందరికీ నోటీసులు అందిస్తున్నారు. ఈ మేరకు 5 నియోజకవర్గాల్లో 4,60,387 మంది ఓటర్లకు నోటీసులు అందించేందుకు జనరేట్‌ చేశారు. ఇప్పటివరకు 3 లక్షల 12 వేల వరకు నోటీసుల జారీ ప్రక్రియ పూర్తయ్యింది. మిగతా లక్షా 48 వేల మందికి నోటీసులు అందించాల్సి ఉంది. అన్‌ మ్యాపింగ్‌ అయిన ఓటర్లు, గత ఓటరు జాబితాతో ప్రస్తుత ఓటరు జాబితాలో ఉన్న వివరాలను పోలుస్తూ స్వల్ప తేడాలు ఉన్న, ఓటరు పేరు మార్పు చెందినా వారందరికీ నోటీసులు జారీ చేస్తున్నారు. మ్యాపింగ్‌ పూర్తయినప్పటికీ ఓటరు పేరు, వయస్సు, తల్లిదండ్రుల పేర్లలో తేడాలు ఇతర కారణాలతో నోటీసులు అందాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా ఏఐ సాంకేతిక పరిజ్ఞానంతో ఎలాంటి తేడాలు ఉన్నా నోటీసులు జనరేట్‌ చేస్తుంది. నోటీసులు జారీ చేయడంలో పలువురు అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని సమాచారం.

ఇబ్బందులు పడుతున్న ఓటర్లు..

అర్హులైన ఓటర్లకు వివిధ కారణాలతో నోటీసులు రావటంతో సరిదిద్దుకునేందుకు తమ పనులు మానుకొని కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ఇబ్బందులు పడుతున్నారు. ఓటరుగా ఉండేందుకు ఎన్నికల సంఘం సూచించిన 12 రకాల పత్రాల్లో ఏవైనా నాలుగు సంబంధిత బీఎల్‌ఓలకు అందించాల్సి ఉంటుంది. ఎక్కువగా నిరుపేదలతో పాటు నిరక్షరాస్యులు ఉండటంతో ధ్రువీకరణ పత్రాల కోసం కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణ వేస్తున్నారు. పత్రాలు లేకపోవడంతో తమ ఓటు గల్లంతవుతుందేమోనని ఆందోళన చెందుతున్నారు.

ఇటీవల విడుదల చేసిన ముసాయిదా ఓటరు జాబితాలో ఎలాంటి అభ్యంతరాలు ఉన్న ఈనెల 16 వరకు ఫిర్యాదు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. సర్‌ ప్రక్రియలో భాగంగా అభ్యంతరాల సేకరణకు బూత్‌ల వారీగా ప్రత్యేకంగా క్యాంపెయిన్‌ నిర్వహిస్తున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. అలాగే కొత్తగా ఓటరు నమోదు చేసుకునేందుకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు.

నియోజకవర్గం జనరేట్‌ అయిన జారీ చేసిన పెండింగ్‌లో

నోటీసులు నోటీసులు ఉన్నవి

నారాయణఖేడ్‌ 74,960 68,189 6,771

అందోల్‌ 66,306 50,797 15,509

జహీరాబాద్‌ 79,539 67,084 12,455

సంగారెడ్డి 75,641 48,829 26,812

పటాన్‌చెరు 1,63,941 77,112 86,829

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement