తుప్రాన్: విధుల్లో ఉన్న హెడ్ కానిస్టేబుల్ గుండెపోటుకు గురై మృతి చెందాడు. ఈ ఘటన మండల పరిధిలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా.. ఎర్రవల్లిలోని మాజీ సీఎం కేసీఆర్ ఫాంహౌస్ ముట్టడించేందుకు వెళ్తున్న కాంగ్రెస్ నాయకులను అడ్డుకునేందుకు పోలీసుశాఖ ఆధ్వర్యంలో అల్లాపూర్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ విధులకు మెదక్ హెడ్ క్వార్టర్స్ నుంచి ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ డి.ఆనంద్ (52) హాజరయ్యారు. విధుల్లో ఉండగానే తీవ్రమైన గుండెపోటు రావడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే తోటి పోలీసు సిబ్బంది ఆయనను మేడ్చెల్ జిల్లాలోని మెడిసిటీ ఆసుపత్రికి తరలించారు. అయితే పరీక్షించిన వైద్యులు ఆనంద్ మృతి చెందినట్లు ధ్రువీకరించారు. కాగా హెడ్ కానిస్టేబుల్ మరణ వార్త తెలుసుకున్న జిల్లా ఎస్పీ శ్రీనివాస్ గౌడ్ తీవ్ర దిగ్భ్రాంతి, విచారం వ్యక్తం చేశారు. మృతుని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని ఆనంద్ స్వగ్రామమైన సంగారెడ్డి జిల్లా, మల్కాపూర్‌లోని ఆయన నివాసానికి తరలించారు.
గుండెపోటుతో ఏఆర్ హెడ్‌కానిస్టేబుల్ మృతి


