తెలంగాణ భాషా సంస్కృతికి ప్రతీక
యాసకు ప్రత్యేక గుర్తింపు
● ఉద్యమంలో కీలకంగా మారిన యాస
● నేడు తెలంగాణ మాండలిక (భాషా) దినోత్సవం
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): ఏ భాష సాహిత్యాలైనా ఆ ప్రాంత జీవన స్థితిగతులను, చారిత్రక నేపథ్యాన్ని, సంస్కృతీ సంప్రదాయాలు, ప్రజల మనోభావాలను ప్రతిబింబించే అమూల్య సాధనాలు. ఈ క్రమంలో తెలుగు నేల ప్రాశస్త్యాన్ని, తెలుగు ప్రజల జీవన వైవిధ్యాన్ని విశ్వవ్యాప్తం చేసిన ఘనత సాహిత్యానికే దక్కుతుంది. రచనకు ప్రాణాధారం భాష అయితే, భాషకు ప్రాణాధారం యాస. ప్రజల నిత్య వ్యవహారం లోంచి పుట్టిన పలుకు సాహిత్యంలో ప్రతిధ్వనించినప్పుడే అది ప్రజల హృదయాలను తాకుతుంది.
భాష ఎంత సహజంగా, జనజీవనానికి ఎంత దగ్గరగా ఉంటే ఆ సాహిత్యం అంతగా దేదీప్యమానమవుతుంది. అలాంటి తెలంగాణ ప్రజల పలుకుకు, పల్లె భాషకు, ప్రాంతీయ యాసకు పట్టం గట్టిన తొలి వైతాళికుడు కాళోజీ నారాయణరావు. తెలంగాణ మట్టి వాసనను, మనిషి మనసు తడిని, పల్లె పలుకుబడిని తన కలానికి అద్దిన ప్రజాకవి. సెప్టెంబర్ 9న ప్రజాకవి కాళోజీ జయంతిని, తెలంగాణ మాండలిక (తెలంగాణ భాషా) దినోత్సవంగా నిర్వహిస్తారు. తెలంగాణ ఉద్యమ సమయంలో, రజాకార్ల సమయంలో, ప్రజల ఆవేదనకు అద్దం, ఆత్మగౌరవానికి ఆయుధం, సామాజిక చైతన్యానికి శంఖారావంగా మన యాస నిలిచిందనడంలో అతిశయోక్తి లేదు. తెలంగాణ ఉద్యమ సమయంలో మాటల్లో, చేతల్లో, రాతల్లో, ఆలోచనల్లో, ఆవేదనలో, ఆహార్యంలో తెలంగాణ స్వరూప స్వభావాలను సంపూర్ణంగా దర్శింపజేసిన జిల్లా కవులు, రచయితలు ఎందరో ఉన్నారు. సిద్దిపేటలో తెలంగాణ ఉద్యమ సమయంలో అనేక మంది కవులు తమ కవితలు, రచనల ద్వారా ఉద్యమానికి మరింత వన్నె తెచ్చారు. దీంతో ఉద్యమం పూర్తిగా కింది స్థాయికి వెళ్లి, ప్రతి ఒక్కరూ ఉద్యమంలో పాల్గొనేలా చేసింది. నేటికి యువ కవులు, రచయితలు రచనలు, కవితలను తెలంగాణ యాసలోనే వెలువరిస్తున్నారు.
తెలంగాణ భాషా సంస్కృతికి ప్రతీక కాళోజీ. తెలంగాణ ఉద్యమ సమయంలో యాస కీలకపాత్ర పోషించింది. తెలంగాణ యాస ఒక భాషా రూపం కాదు. అది ప్రజల జీవన స్వరం. తెలంగాణ యాస సాహిత్యంలో గౌరవాన్ని పొంది, పల్లె పలుకును పండితుల పీఠంపై కూర్చోబెట్టింది.
–డాక్టర్ బామండ్ల రాజు,
తెలుగు అధ్యాపకులు
మన అమ్మ భాష, మాట్లాడే భాష మనకు ప్రత్యేకం. తెలంగాణ యాసకు ప్రపంచంలో ఎక్కడికెళ్లినా ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. ప్రపంచంలో తెలుగు మాట్లాడే వారు 10కోట్ల మంది ఉన్నా.. వారు మాట్లాడే యాసను గుర్తించి తెలంగాణ వారిని గుర్తుపట్టే అవకాశం ఉంటుంది.
–అమ్మన చంద్రారెడ్డి,
సిద్దిపేట రచయితల సంఘం అధ్యక్షుడు


