కొల్చారం(నర్సాపూర్): సామాజిక మాధ్యమంలో సీఎంను దూషించిన యువకుడిపై కేసు నమోదైంది. ఈ ఘటన మంగళవారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ హైమద్ మోహినొద్దీన్ కథనం ప్రకారం.. మండలంలోని రంగంపేట గ్రామానికి చెందిన ఎంజాల శ్రీనివాస్ సోమవారం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి అసభ్యకరమైన, అవమానకరమైన పదజాలంతో దూషించాడు. పైగా సెల్‌ఫోన్‌లో చిత్రీకరించి తన వాట్సప్ స్టేటస్‌లో, ఇతరులకు షేర్ చేసినట్లు కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు గొండ కష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో శ్రీనివాస్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.
చేగుంట(తూప్రాన్): జీవితంపై విరక్తి చెంది వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన పులిమామిడి గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గొర్రె దుర్గయ్య(70) భార్య సత్తమ్మ మూడేళ్ల క్రితం మృతి చెందింది. ఈ విషయంలో దుర్గయ్య మనస్తాపానికి గురై నిత్యం తన భార్యను గుర్తు చేసుకుంటూ బాధపడుతుండేవాడు. ఈ క్రమంలో సోమవారం రాత్రి వ్యవసాయ పొలం వద్ద దుర్గయ్య చెట్టుకు ఉరివేసుకున్నాడు. మంగళవారం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఎస్‌ఐ బిక్యానాయక్ పంచనామా నిర్వహించి కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తూప్రాన్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.


