కొండపాక(గజ్వేల్): మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు రాకపోవడంతో పాటు స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు అనుచిత వ్యాఖ్యలు చేసేలా ప్రేరేపించడాన్ని నిరసిస్తూ ఎర్రవల్లిలో ఫాంహౌజ్ ముట్టడికి కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు భారీగా వెళ్తారని, వీరిని అడ్డుకునేందుకు బీఆర్‌ఎస్ నాయకులు వెళ్తారన్న సమాచారం పోలీసులకు అందింది. ఈ మేరకు మంగళవారం పోలీసులు కొండపాక , కుకునూరుపల్లి మండలాల బీఆర్‌ఎస్ నాయకులను ముందస్తుగా అరెస్టు చేశారు. అరెస్టు కాకుండా బయట ఉన్న నాయకులు ఫాంహౌజ్ వద్దకు వెళ్లకుండా దుద్దెడ శివారులోని రాజీవ్ రహదారిపై ఉన్న టోల్ ప్లాజా వద్ద భారీగా పోలీస్ బలగాలు మోహరించి వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేశాయి. అయినా బీఆర్‌ఎస్ నాయకులు ఫాంహౌజ్ వద్దకు పెద్ద సంఖ్యలో తరలి వెళ్లారు. టోల్ ప్లాజా వద్ద భారీగా పోలీసులు మోహరించడంతో వాహనదారులు భయాందోళనకు గురయ్యారు.


