పటాన్‌చెరు టౌన్: పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఎండీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 3కే రన్ ఆదివారం ఉత్సాహంగా సాగింది. ఓఆర్‌ఆర్ సర్వీస్ రోడ్డు సమీపంలో జరిగిన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి ప్రారంభించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. కాలుష్య నియంత్రణలో ప్రజల భాగస్వామ్యం కీలకమన్నారు. మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించాలని సూచించారు. రన్‌లో యువత, మహిళలు, విద్యార్థులు, సీనియర్ సిటిజన్లు, ప్రభుత్వ ఉద్యోగులు, పరిశ్రమల ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ‘పచ్చదనం పెంచుదాం.. కాలుష్యం.. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గిద్దాం’ అంటూ అవగాహన కల్పించారు. ‘రన్ ఫర్ నేచర్’లో పాల్గొన్న వారికి ధ్రువపత్రాలతో పాటు మొక్కలు పంపిణీ చేశారు.


