రణగొణ ధ్వనులతో అనర్థాలు
నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలే..
శబ్ద కాలుష్యంతో ప్రాణాలకే ముప్పు
సంగారెడ్డి క్రైమ్: వేడుకల్లో భారీ డీజే సౌండ్ పెట్టడం వల్ల చిన్న, పెద్ద తేడా లేకుండా ప్రాణాలకు ముప్పు ఉన్నట్లు వైద్యులు పేర్కొంటున్నారు. జిల్లా కేంద్రమైన సంగారెడ్డితో పాటు గ్రామాలు, పట్టణాలు తేడా లేకుండా డీజే మోగడం సరదాగా మారింది. ఇష్టమైన పాటలు మరింత సౌండ్ వినిపించేందుకు ఇందులో సౌలభ్యం ఉండటంతో యువత అమితంగా ఇష్టపడుతున్నారు. దీంతో ఎటు చూసినా రానున్న గణపతి ఆగమన్, గణపతి నవరాత్రి మండపాలు, ఊరేగింపులు ఇలా ఎక్కడ చూసినా డీజేలు మోగనున్నాయి. అయితే శబ్దం మితిమీరితే ప్రాణాంతకంగా మారుతుంది. ఈ నేపథ్యంలో పండుగలు, విందులు, వినోదాలు వంటి సందర్భం ఏదైనా డీజే వినియోగంపై పోలీసులు దృష్టి సారిస్తున్నారు.
భారీ శబ్దంతో సమస్య
జిల్లా కేంద్రంలో ప్రశాంత వాతావరణంలో పండుగలు, విందులు జరుపుకునేందుకు అధికారులు ఆదేశాలు జారీ చేస్తారు. కానీ వాటిని ఎవరూ పట్టించుకోవడం లేదు. డీజే శబ్దాన్ని ఒక స్థాయి వరకు మాత్రమే శరీరం తట్టుకుంటుంది. 60 డెసిబుల్స్ తీవ్రతతో ఏకధాటిగా వింటే వినికిడి సమస్యలు వస్తాయి. సమస్య తలెత్తిన వెంటనే చికిత్స పొందకుండా ఉంటే పూర్తిగా వినికిడి దెబ్బతింటుందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. ఒకవేళ డెసిబుల్ 85 దాటితే గుండె లయ తప్పుతుందని కార్డియాలజిస్టులు చెబుతున్నారు. గుండెపోటుతో పాటు మెదడులోని నరాలు చిట్టిపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
వేడుక ఏదైనా డీజే ఉండాల్సిందే!
భారీ శబ్దంతో గుండెపోటు
వచ్చే అవకాశం
పరిమితి మించితే ప్రమాదమే
అధిక శబ్దాలు అనర్థానికి దారితీస్తాయి. భారీ శబ్దాలు ప్రమాదకరం. ఈ శబ్దాలను దగ్గరగా వింటే చెవులు, గుండె సంబంధిత సమస్యలు వస్తాయి. ఒక్కోసారి గుండెపోటు కూడా రావచ్చు. చిన్నారులు, వృద్ధులు తీవ్రమైన శబ్దాలకు దూరంగా ఉండడం ఆరోగ్యకరం.
– డాక్టర్ సురేశ్ కుమార్, సంగారెడ్డి
నిబంధనలు ఉల్లంఘిస్తూ ప్రధాన రోడ్లలో, కాలనీల్లో భారీ డీజేలు పెట్టి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తే పోలీసులకు సమాచారం ఇవ్వండి. డీజేను సీజ్ చేసి, చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.
– సత్తయ్య గౌడ్, డీఎస్పీ, సంగారెడ్డి


