భయపడాల్సిన పని లేదు
ఆందోళనలో ఓటర్లు!
● ఏం చేయాలో తెలియక అయోమయం
● జహీరాబాద్‌లో 79 వేల మందికి..
జహీరాబాద్ టౌన్: జహీరాబాద్ పట్టణంలోని గాంధీనగర్‌కు చెందిన టి.నగేశ్ ఎన్యూమరేషన్ పత్రంలో పొందుపరిచిన తండ్రి వయసుకు తన వయసుకు చాలా దగ్గర వ్యత్యాసం ఉండటంతో ఆయనకు నోటీసు వచ్చింది. దానికి ఎలాంటి పత్రం ఇవ్వాలో అర్థం కావడం లేదని పేర్కొన్నారు.
● ’పట్టణంలోని వతన్‌బాగ్‌కు చెందిన వాహీద్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులకు నోటీసులొచ్చాయి. పత్రాలు సమర్పించాలని బీఎల్‌ఓ చెప్పారు. కానీ ఏ పత్రాలు సమర్పించాలో తెలియక అయోమయానికి గురవుతున్నారు.
● జహీరాబాద్ నియోజకవర్గంలోని కొందరు వ్యవసాయ కూలీలకు కూడా నోటీసులు వచ్చాయి. వీరందరికీ అధికారుల ముందు జవాబు ఏమీ ఇవ్వాలో తెలియడం లేదు. ఇలా చాలా మందికి నోటీసులు రావడంతో వారంతా ఆందోళన చెందుతున్నారు.
● ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్‌ఐఆర్) ప్రక్రియ పూర్తయింది. ముసాయిదా జాబితాను ఇటీవల అధికారులు విడుదల చేశారు. కొందరి పేర్లు, చిరునామాలు, వయసు తదితర వివరాల్లో తప్పులు వచ్చాయి. చిన్న, చిన్న పొరపాట్ల వల్ల చాలా మందికి సర్ నోటీసులు వచ్చాయి. 2020 ఓటరు జాబితాలో ఉన్న తప్పులు ఉన్న ఓటర్లకు ఇప్పుడు నోటీసులు అందుతున్నాయి. నోటీసులు అందుకున్న వారు నిర్దేఽశించిన తేదీల్లో సరైన పత్రాలు అందజేయాలి. ఎన్యూమరేషన్ సమయంలో ఓటర్లు చుక్కలు చూడగా.. ఇప్పుడు నోటీసుల ప్రక్రియ కూడా అలానే జరుగుతుంది. బీఎల్‌ఓలు ఇళ్లకు వెళ్లకుండా ఓటర్లకు ఫోన్ చేసి నోటీసులు తీసుకెళ్లాలని చెబుతున్నారు. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు ఎక్కడ తొలగిపబడుతుందోనని అందోళనకు గురవుతున్నారు.
79 వేల మందికి..
జహీరాబాద్ నియోజకవర్గంలో ఐదు మండలాలు ఉండగా.. 2,31,564 మంది ఓటర్ల వివరాలు డిజిటలైజేషన్ చేశారు.79,539 మందికి ఎన్నికల కమిషన్ నుంచి వివిధ కారణాలతో నోటీసులు జారీ చేయనుంది. ఇప్పటి వరకు 62,667 మందికి నోటీసులు జారీ చేశారు. ఇంకా 16,858 మందికి నోటీసులు జారీ చేయాల్సి ఉంది. నోటీసులు అందుకున్న వారిలో కొంత మంది అధికారుల వద్ద హాజరై వారికి సంబంధిత పత్రాలను అందిస్తున్నారు.
నోటీసులు అందుకున్న వారు ఎన్నికల సంఘం నిర్దేశించిన సరైన పత్రాలు అందజేయాలి. నోటీసు వచ్చినంత మాత్రాన ఓటు హక్కు తొలగిపోదు. చిన్నపాటి తేడాలు ఉన్నవారు సంబంధిత ధ్రువపత్రాలతో హియరింగ్ సమయంలో సరిచేసుకోవచ్చు. ఓటర్లు భయపడాల్సిన పనిలేదు. తగిన పత్రాలు సమర్పిస్తే సరిపోతుంది.
– దశరథ్, తహసీల్దార్, జహీరాబాద్


