చేర్యాల(సిద్దిపేట): విద్యా రంగంలో విశేష సేవలు అదిస్తున్నందుకు మండల పరిధిలోని దొమ్మాట ఎంపీపీఎస్ హెచ్‌ఎం అనగోని వెంకటేశ్వర్లు జాతీయ స్థాయి అవార్డు పొందారు. సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని పురస్కరించుకుని లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఈ అవార్డును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన సేవలను గుర్తించి సత్కరించడం సంతోషంగా ఉందన్నారు. ఈ గుర్తింపు భవిష్యత్తులో మరింత బాధ్యతతో విద్యార్థుల అభ్యున్నతికి కృషి చేసేందుకు ప్రోత్సహిస్తుందని తెలిపారు. ఆయనను పలువురు విద్యాశాఖ అధికారులు, తోటి ఉపాధ్యాయులు, విద్యార్థులు అభినందించారు.
సదాశివపేట(సంగారెడ్డి): తొమ్మిదిమంది జూదరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ వెంకటేశ్ వివరాల ప్రకారం.. పట్టణ పరిధిలోని ఓ శ్మశానవాటిక సమీపంలో పాడుబడ్డ రేకుల షెడ్డులో ఆదివారం పేకాట అడుతున్నారని విశ్వసనీయ సమాచారం అందింది. ఈ మేరకు మధ్యాహ్నం దాడి చేసి 9 మంది జూదరులను అదుపులోకి తీసుకుని వారిపై కేసు నమోదు చేశారు. పట్టుబడిన వారిలో చీల వీరేశం, గొంటెల నరేందర్, చినమల శ్రీనివాస్, అల్గొల సతీశ్‌కుమార్, అల్లం నాగరాజు, ఎగమామిడి శ్రీనివాస్, బోడగామ వీరేశం, ప్రకాశ్, బంటు మహేశ్‌కుమార్ ఉన్నారు. వారి వద్ద నుంచి రూ.23వేల నగదు, 10 ఫోన్లు, 6 మోటార్ బైక్‌లను స్వాధీనం చేసుకుని జూదరులపై కేసు నమోదు చేశారు.
5 తులాల బంగారం,
వెండి, నగదు అపహరణ
జహీరాబాద్ టౌన్: తాళం వేసిన ఇంట్లో గుర్తుతెలియని దుండగులు చొరబడి బంగారం, వెండి ఆభరణాలతో పాటు నగదు ను ఎత్తుకెళ్లారు. ఈ సంఘటన పట్టణంలోని నారాయణనగర్ కాలనీలో చోటుచేసుకుంది. జహీరాబాద్ టౌన్ ఎస్‌ఐ లవకుమార్ కథనం ప్రకారం.. కాలనీకి చెందిన విశ్రాంత ఉద్యోగి కెంపుల సాయన్న కుటుంబ సభ్యులతో కలిసి ఈ నెల 2న ఉదయం తమ కూతురి ఇంటికి వెళ్లారు. తిరిగి ఆదివారం ఉదయం ఇంటికి వచ్చి చూడగా, ఇంటి తాళాలు పగులగొట్టి ఉన్నాయి. లోపలికి వెళ్లి పరిశీలించగా, బీరువాను సైతం పగులగొట్టి అందులోని 5 తులాల బంగారు ఆభరణాలు, 40 తులాల వెండి వస్తువులు, రూ. 50 వేల నగదును దొంగలు ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.
సంగారెడ్డి క్రైమ్: హాస్టల్ విద్యార్థి అదృశ్యమయ్యాడు. ఈ ఘటన పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ రాము నాయుడు వివరాల ప్రకారం.. వట్‌పల్లి మండలం ఖాదిరాబాద్ గ్రామానికి చెందిన గొల్ల కిషన్‌కు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు లక్ష్మణ్(13), స్థానిక సంగారెడ్డిలోని హాస్టల్‌గడ్డలో ఉన్న సమీకృత సంక్షేమ హాస్టల్‌లో ఉంటూ పట్టణంలోని ప్రభుత్వ బాలుర పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. శనివారం ఉదయం 5 గంటలకు తన స్వగ్రామం నుంచి పాఠశాలకు వెళ్లిన విద్యార్థి సాయంత్రం హాస్టల్‌కు వెళ్లలేదు. ఇటు ఇంటికి తిరిగి రాలేదు. దీంతో హాస్టల్ అధికారులు విద్యార్థి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. చుట్టుప్రక్కల, బంధువుల వద్ద వెతికినా ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆచూకీ తెలిస్తే 87126 61830 నంబర్లకు తెలియజేయాలని తెలిపారు.


