సైకిల్‌పై వచ్చి.. విధులు పర్యవేక్షించి.. | - | Sakshi
Sakshi News home page

సైకిల్‌పై వచ్చి.. విధులు పర్యవేక్షించి..

Sep 7 2026 7:39 AM | Updated on Sep 7 2026 7:39 AM

ఆదర్శంగా నిలుస్తున్న హుస్నాబాద్‌ మున్సిపల్‌ కమిషనర్‌

సైకిల్‌పై వచ్చి శానిటేషన్‌ పనులను పరిశీలిస్తున్న కమిషనర్‌ మల్లికార్జున్‌

హుస్నాబాద్‌: కాలుష్య రహిత పర్యావరణానికి కృషి చేస్తూ విధులు నిర్వహిస్తున్న హుస్నాబాద్‌ మున్సిపల్‌ కమిషనర్‌ మల్లికార్జున్‌ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. 80 కిలోమీటర్లకు పైగా సైకిల్‌పై ప్రయాణం చేస్తూ పనులను పర్యవేక్షించారు. జిల్లా కేంద్రమైన సిద్దిపేట మున్సిపాలిటీ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కాగా ఆదివారం సిద్దిపేట నుంచి హుస్నాబాద్‌ పట్టణానికి సైకిల్‌పై ప్రయాణించి ఇక్కడి పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. పట్టణంలోని ప్రతీ గల్లీకి తిరుగుతూ పనులను పర్యవేక్షించారు. వీధుల పరిశుభ్రత, ఇంటింటి చెత్త సేకరణ, తదితర అంశాలను స్వయంగా పరిశీలిస్తూ సిబ్బందికి తగు సూచనలు ఇచ్చారు. అలాగే పట్టణంలో కొనసాగుతున్న వివిధ అభివృద్ధి పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు.

పర్యావరణ పరిరక్షణ, ఆరోగ్యం

సైకిల్‌పై వచ్చి పనులను తనిఖీ చేయడం, గల్లీ, గల్లీకి తిరుగుతూ కమిషనర్‌ దాదాపు పట్టణంలో 20 కిలో మీటర్లు సైకిల్‌పై ప్రయాణం చేశారు. ప్రతి రోజు సైకిల్‌ తొక్కడం, ఆరోగ్యకరమైన జీవన శైలిని ప్రోత్సహించడం, వాహనాలు తగ్గించి సైకిల్‌ వాడకం ద్వారా వాతావరణ కాలుష్యాన్ని తగ్గించవచ్చని కమిషనర్‌ చేపట్టిన ఈ సైకిల్‌ ప్రయాణం మంచి సందేశాన్ని అందించిందని ప్రజలు చర్చించుకున్నారు. అలాగే ప్రభుత్వ వాహనాన్ని పక్కన బెట్టి, సైకిల్‌పై వచ్చి ఖర్చు ఆదా చేశారని పేర్కొన్నారు. అయితే సైకిల్‌ ప్రయాణం ఇలానే కొనసాగాలని స్ధానికులు కోరుకుంటున్నారు. కాగా కమిషనర్‌ను మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ లక్ష్మి, వైస్‌ చైర్‌పర్సన్‌ పద్మ, కౌన్సిలర్లు అభినందించారు.

80 కిలోమీటర్లు ప్రయాణం

పారిశుద్ధ్య పనుల తనిఖీలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement