సదాశివపేట రూరల్(సంగారెడ్డి): మండలంలోని నందికంది రామలింగేశ్వర ఆలయ ప్రాంగణంలో ఆదివారం ’కొత్త తెలంగాణ చరిత్ర బృందం’ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి ‘బొమ్మల పల్లకీ’ ప్రతిభ పురస్కారాల ప్రధానోత్సవం నిర్వహించారు. పోటీల్లో విజేతగా నిలిచిన సీతమ్మ లొద్ది యాత్రపై వీడియో రూపొందించిన డి.రవీందర్ రెడ్డి(ప్రథమ), శ్రీరంగాపూర్ రంగనాయకుల చరిత్రపై వీడియో రూపొందించిన ఎన్.విష్ణుకు(ద్వితీయ)పురస్కారాలు అందజేశారు. అలాగే తెలంగాణ చరిత్రపై విభిన్న అంశాలతో వీడియోలు రూపొందించిన యూనుస్ పర్హాన్, రవికుమార్, సముద్రాల రాజు, ఆచార్య భద్రగిరిష్, రంగాచార్యులు, సతీశ్, రోహిత్, శ్రీనివాస్, సాయికుమార్, కిశోర్, నరేందర్, కరుణాకర్, రాజ్‌కుమార్, రమేశ్ శర్మ, శ్రీకాంత్ తదితరులకు ప్రత్యేక ప్రతిభ పురస్కారాలను కొత్త తెలంగాణ చరిత్ర బృందం అధ్యక్షుడు రామోజు హరగోపాల్, ఇంటాక్ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులు మణికొండ వేదకుమార్ అందజేశారు. తెలంగాణ చరిత్ర, సంస్కృతిని నేటి తరానికి దృశ్య, శ్రవణ మాధ్యమాల ద్వారా అందించేందుకు చరిత్ర బృందం చేస్తున్న ప్రత్యేక కృషిలో భాగంగానే ఈ పోటీలు నిర్వహించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఈమని శివనాగిరెడ్డి, కేటీసీబీ కట్టా శ్రీనివాస్, సర్పంచ్ స్రవంతి, ఆలయ కమిటీ అధ్యక్షుడు శ్రీనివాస్, అరవింద ఆర్యా, మఠం వినోద్ కుమార్, అశోక్ బాబు, విజయభాస్కర్ రెడ్డి పాల్గొన్నారు.


