మిరుదొడ్డి(దుబ్బాక): అక్బర్‌పేట–భూంపల్లి మండల పరిధిలోని మోతెలో సామాజిక సంఘ సేవకుడు బోధనం చిన్న నర్సింహారెడ్డి (54) ఆదివారం గుండెపోటుతో మృతి చెందాడు. మృతునికి భార్య నీరజతో పాటు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కొడుకులు లేకపోవడంతో చిన్న కూతురు శ్రీజ తలకొరివి పెట్టి అంత్యక్రియలు పూర్తి చేసింది.
సిద్దిపేటకమాన్: చాలిచాలనీ జీతంతో పాటు ఉద్యోగం పర్మినెంట్ కాకపోవడంతో మానసిక వేదనకు గురైన ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రిలో చోటు చేసుకుంది. సిద్దిపేట వన్‌టౌన్ సీఐ మహేందర్‌రెడ్డి కథనం ప్రకారం.. నంగునూరు మండలం రాజగోపాల్‌పేటకు చెందిన అకుబత్తిని నర్సింలు, భార్య లలిత, ఇద్దరు కుమారులతో కలిసి పట్టణంలోని ఇందిరానగర్‌లో ఉంటున్నారు. వీరి చిన్న కుమారుడు పవన్‌కుమార్ (25) సిద్దిపేట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఏనిమిదేళ్లుగా అవుట్ సోర్సింగ్ పద్ధతిలో ల్యాబ్ అటెండెంట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. కొంత కాలంగా చాలీచాలని జీతంతో చేసే ఈ ఉద్యోగం ఉంటుందో లేదోనని మానసిక వేదనకు గురవుతున్నాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి ప్రభుత్వాసుపత్రి ఆసుపత్రిలోని మూడో ఫ్లోర్‌లో పాథాలజీ డిపార్ట్‌మెంట్‌లో ఫైర్ సేఫ్టీ ఇనుపరాడ్డుకు తాడుతో ఉరివేసుకున్నాడు. ఆదివారం చూసిన సిబ్బంది కిందకు దించి ఎమర్జెన్సీ వార్డుకు తీసుకెళ్లగా పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేశారు.


