గజ్వేల్‌రూరల్: మండల పరిధిలోని రంగంపేట అటవీ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు తవ్వకాలు జరిపిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ విషయం తెలుసుకున్న రంగంపేట సర్పంచ్ నాగరాజు గ్రామస్తులతో కలిసి గ్రామ సమీపంలోని అటవీప్రాంతంలో తవ్వకాలు జరిపిన బొమ్మనగుండ్ల ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ ప్రాంతంలో నాలుగైదు చోట్ల తవ్వకాలు జరిపినట్లు ఆనవాళ్లను గుర్తించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అటవీ ప్రాంతం సమీపంలోని పంట పొలాల వద్దకు రైతులు, మహిళలు పనుల కోసం వస్తుంటారని, తవ్వకాలు జరపడంతో భయాందోళనలకు గురవుతున్నట్లు తెలిపారు. తవ్వకాలు జరిగిన చోట పగిలిపోయిన కుండ పెచ్చులను గుర్తించామని, ఈ తవ్వకాలు గుప్త నిధుల కోసమా.. లేదా ఇంకేమైనా ఉందా అనే కోణంలో సంబంధిత శాఖల అధికారులు విచారణ జరిపి, తవ్వకాలకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నామన్నారు.


