యువ రైతు దుర్మరణం
వెల్దుర్తి(తూప్రాన్): బోర్ మోటార్ ఆన్ చేస్తుండగా విద్యుత్ షాక్‌తో ఓ యువ రైతు దుర్మరణం చెందాడు. వెల్దుర్తి మండలం మానేపల్లి గ్రామంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఎస్సై కరుణాకర్ రెడ్డి కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన రిక్కం యాదమ్మ, రాములు దంపతుల కుమారుడు రిక్కం శ్రీకాంత్ (30) తనకున్న అర ఎకరం భూమిలో వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. శనివారం ఉదయం శ్రీకాంత్ కుటుంబ సభ్యులతో కలిసి వ్యవసాయ పొలానికి వెళ్లాడు. కుటుంబ సభ్యులు వరి పంటకు కలుపు తీస్తుండగా, పంటకు నీరు పెట్టడానికి బోర్ మోటార్ ఆన్ చేయడానికి ప్రయత్నించాడు. ఆ సమయంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగలడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య అనూషతో పాటు ఇద్దరు కుమారులు ఉన్నారు. శ్రీకాంత్ ఆకస్మిక మృతితో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


