జహీరాబాద్ టౌన్: మద్యానికి బానిసై ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన పట్టణ సమీపంలోని అల్లిపూర్‌లో శనివారం చోటుచేసుకుంది. ఎస్సై లవకుమార్ కథనం ప్రకారం.. అల్లిపూర్లోని నేతాజీనగర్‌కు చెందిన మట్టు నరేష్ (31) వృత్తిరీత్యా డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. గత కొన్ని నెలలుగా మద్యానికి బానిసయ్యాడు. కుటుంబసభ్యులు ఎంత నచ్చజెప్పినా అతని ప్రవర్తనలో మార్పు రాలేదు. ఈ క్రమంలోనే మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో సీలింగ్ ఫ్యాన్‌కు టవల్‌తో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి సోదరుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు.
జిన్నారం(పటాన్‌చెరు): ప్రమాదవశాత్తు టిప్పర్ ఢీకొని వ్యక్తి మృతిచెందిన సంఘటన బొల్లారం పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ సుధీర్ కుమార్ కథనం ప్రకారం.. హైదరాబాద్ నారాయణగూడ విట్టల్ దాడి ప్రాంతానికి చెందిన శ్రీవారి మురళి (60) మెట్రో మెనేజ్‌మెంట్ సెక్యూరిటీ ఏజెన్సీలో సూపర్‌వైజర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. శనివారం కాజిపల్లి కంకర క్వారీలో విధులు నిర్వహిస్తున్న ఏజెన్సీ సభ్యులకు సంబంధించిన వివరాలు సేకరించేందుకు బయలుదేరాడు. ఈ క్రమంలో ఎదురెదురుగా వస్తున్న రెండు టిప్పర్లు వెళ్లేందుకు రోడ్డు సరిపోకపోవడంతో వాహనాలు నిలిచిపోయాయి. అందులోని ఓ టిప్పర్ వెనకాల మురళి తన ద్విచక్ర వాహనంపై ఆగి ఉన్నాడు. వెనకాల వ్యక్తి ఉన్న విషయాన్ని గమనించని డ్రైవర్ ఎదురుగా ఉన్న వాహనానికి దారిని ఇచ్చే క్రమంలో ఒక్కసారిగా వెనక్కి వచ్చాడు. దీంతో టిప్పర్ మురళిపై వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి మేనల్లుడు యశ్వంత్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
హత్నూర(సంగారెడ్డి): పరిశ్రమలో పనిచేస్తున్న మహిళా కార్మికురాలు మిషన్‌లో పడి మృతి చెందిన సంఘటన మండలంలోని ముచ్చర్ల శివారులోని సువర్ణదుర్గ పేపర్ పరిశ్రమలో శనివారం చోటు చేసుకుంది. జార్ఖండ్‌లోని గూడ జిల్లా పత్రగాయి గ్రామానికి చెందిన సిమోతి మారండి (48) భర్త కుంచు మురుమూరుతో కలిసి పరిశ్రమలో గత కొంతకాలంగా కార్మికురాలుగా పనిచేస్తోంది. భర్త కొద్ది రోజుల క్రితం సొంతూరుకు వెళ్లగా, ఆమె మాత్రం ఎప్పటిలాగే ఉదయం విధులకు వెళ్లారు. మధ్యాహ్నం సమయంలో భోజనానికి బయటకు వచ్చి విధుల్లోకి వెళ్లింది. ఈక్రమంలో దుస్తులు పేపర్ మిషన్‌కు తగిలి అందులో పడి మృతి చెందింది. పరిశ్రమ యాజమాన్యం రహస్యంగా సంగారెడ్డి ఆస్పత్రికి తరలించిందని కార్మికులు ఆరోపించారు. మహిళా కార్మికురాలికి న్యాయం చేయాలని తోటి కార్మికులు పరిశ్రమ గేటు ఎదుట ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ శ్రీధర్ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని కార్మికులకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు.


