ములుగు ఫారెస్ట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ సెంటర్ విద్యార్థుల పరిశోధన
పాల్వంచరూరల్: అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల ఆనవాళ్లు, అడుగుజాడల కోసం విద్యార్థులు సర్వే నిర్వహిస్తున్నారు. సిద్దిపేట జిల్లా ములుగులోని ఫారెస్ట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ సెంటర్‌లో బీఎస్సీ(ఫారెస్ట్) తృతీయ సంవత్సరం చదువుతున్న 15 మంది విద్యార్థులు ప్రాజెక్ట్ వర్క్‌లో భాగంగా జంతువులపై అధ్యయనం చేసేందుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు వచ్చారు. డీఎఫ్‌ఓ సిద్ధార్థ విక్రమ్‌సింగ్, వైల్డ్‌లెఫ్ ఎఫ్‌డీఓ బాబు వారిలో పది మందిని కిన్నెరసాని అభయారణ్యం, మరో ఐదుగురిని అశ్వారావుపేట రేంజ్‌లో కేటాయించారు. నెల పాటు ఎఫ్‌బీఓల సహకారంతో సర్వే జరగనుండగా విద్యార్థులు అటవీ జంతువుల అడుగుజాడలను గుర్తించి నివేదిక ఇస్తారు. ఇప్పటికే అశ్వారావుపేట రేంజ్, అభయారణ్యంలోని యానంబైలు, ఆళ్లపల్లి, రంగాపురం రేంజ్‌లలో సర్వే పూర్తికాగా, ప్రస్తుతం చింతోని చెలక ఏరియాలో కొనసాగుతోంది. కాగా, 15 మంది విద్యార్థుల్లో ఐదుగురు విద్యార్థినులు కూడా ఉన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు అటవీ ప్రాంతంలో సంచరిస్తూ వివరాలు సేకరిస్తున్నారు. రాత్రి అడవిలోని బేస్ క్యాంప్‌ల్లోనే వంటావార్పు చేసుకుని అక్కడే నిద్రిస్తున్నారు.


