నారాయణఖేడ్: బీఆర్‌ఎస్ పార్టీ పదేళ్లలో చేపట్టని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను కాంగ్రెస్ అధికారంలో వచ్చాక వెయ్యి రోజుల్లోనే పూర్తి చేసి చూపిందని జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్, ఎమ్మెల్యే సంజీవరెడ్డి అన్నారు. శనివారం పట్టణంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన విజయోత్సవ ర్యాలీలో పాల్గొని మాట్లాడారు. గత పాలనలో నియోజకవర్గం అన్ని రంగాల్లో వెనుకబడిందన్నారు. ఒక్క నారాయణఖేడ్ నియోజకవర్గంలోనే 3,500 ఇందిరమ్మ గృహలు మంజూరు చేశామన్నారు. గత పాలకులు ఎంతమందికి ఇండ్లు నిర్మించి ఇచ్చారో చెప్పాలన్నారు. గత పదేళ్లలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు మంజూరు ఇవ్వలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం అడిగిన వారందరికి రేషన్‌కార్డులు, ఉచిత బస్సు సౌకర్యం, గ్యాస్ అందజేస్తుందన్నారు. తమ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులతోనే గ్రామ పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పట్టి పార్టీ బలపర్చిన వారిని ఎన్నుకున్నారని అన్నారు. కార్యక్రమంలో టీపీసీసీ సభ్యులు శ్రీనివాస్, డీసీసీ ప్రధాన కార్యదర్శి చంద్ర శేఖర్‌రెడ్డి, అత్మ చైర్మన్ వినోద్‌పాటిల్, మున్సిపల్ వైస్ చైర్మన్ శంకర్, నాయకులు తాహేర్ అలీ, మండల కాంగ్రెస్ నాయకులు, సర్పంచ్‌లు పాల్గొన్నారు.
ఎంపీ సురేశ్ షెట్కార్, ఎమ్మెల్యే సంజీవరెడ్డి


