చేర్యాల(సిద్దిపేట): వృత్తి పట్ల నిబద్ధత, సేవాగుణం, మంచితనానికి మారుపేరుగా ప్రభుత్వ ఉపాధ్యాయుడు అందె విజయ్‌కుమార్ నిలుస్తున్నారు. విద్యార్థుల ప్రగతి కోసం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. 20 ఏళ్లుగా అనాథ, నిరుపేద పిల్లలకు అండగా నిలిచి, ఇప్పటివరకు 10 మంది తల్లిదండ్రులు లేని పిల్లలను దత్తత తీసుకుని విద్యను అందించారు. పేద బాలికల వివాహాలకు సహాయం చేయడంతో పాటు హమాలీలు, రిక్షా కార్మికులకు దుప్పట్లు, నిత్యావసర సరుకులు ఇచ్చారు. ‘గివింగ్ హ్యాండ్స్’ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రశంసలందుకుంటున్నారు. పలు రాష్ట్రస్థాయి అవార్డులతో పాటు 2025లో సిద్దిపేట జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా సత్కారం అందుకున్నారు. గ్రామీణ నిరుపేద విద్యార్థులను ఉన్నత స్థాయికి చేర్చడమే తన ఆశయమని విజయ్‌కుమార్ పేర్కొన్నారు.


