చోరీ నిందితురాలి అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

చోరీ నిందితురాలి అరెస్ట్‌

Sep 5 2026 7:25 AM | Updated on Sep 5 2026 7:25 AM

చోరీ నిందితురాలి అరెస్ట్‌ ఐదు మేకల అపహరణ

జహీరాబాద్‌ టౌన్‌: దొంగతనానికి పాల్పడిన నిందితురాలిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. శుక్రవారం జహీరాబాద్‌ టౌన్‌ ఎస్‌ఐ లవకుమార్‌ కేసు వివరాలు వెల్లడించారు. గురువారం మధ్యాహ్నం పట్టణంలోని అహ్మద్‌ నగర్‌కు చెందిన ప్రైవేట్‌ ఉపాధ్యాయుడు షకీల్‌ పాషా ఇంట్లో ఎవరూ లేని సమయంలో కర్ణాటకలోని కలబురగి జిల్లా భరత్‌ తండాకు చెందిన జయశ్రీ చొరబడింది. తన వెంట తెచ్చుకున్న ఐరన్‌ రాడ్‌, స్క్రూ డ్రైవర్‌ సహాయంతో ఇంటి తలుపులతో పాటు బీరువా తాళాలు పగులగొట్టింది. అందులోని రెండు తులాల బంగారం నల్లపూసల దండ, 20 తులాల వెండి పట్టగొలుసులు, రెండు వెండి కాళ్ల కడియాలను చోరీ చేసి పరారైంది. ఆమె వద్ద నుంచి వెండి, బంగారు సొత్తును స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు.

అల్లాదుర్గంలో మేకల దొంగలు..

అల్లాదుర్గం(మెదక్‌): గూగుల్‌ మ్యాప్‌ ఆధారంగా చోరీలకు పాల్పడుతున్న మేకల దొంగలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ ఘటన అల్లాదుర్గంలో శుక్రవారం చోటు చేసుకుంది. ఏఎస్‌ఐ దయానంద్‌ వివరాల ప్రకారం.. రెడ్డిపల్లి గ్రామానికి చెందిన అవుల బాలయ్యకు చెందిన రెండు మేకలను దొంగలు ఎత్తుకెళ్లారు. ఈ విషయంపై బాధితుడు అల్లాదుర్గం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా పటాన్‌చెరు మండలం లాక్డార్‌ గ్రామానికి చెందిన పల్లపు సాయికుమార్‌, వడ్డె అనిల్‌, వడ్డె షాదుల్లా, వడ్డె ప్రసాద్‌, మనోహర్‌ కలిసి మేకలను ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు. కాగా నిందితులు కారులో తిరుగుతూ గూగుల్‌ మ్యాప్‌ ఆధారంగా మేకల షెడ్డులను పసిగట్టి చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు.

తూప్రాన్‌: గుర్తుతెలియని దుండగులు మేకలను ఎత్తుకెళ్లారు. బాధితుడి కథనం ప్రకారం.. పట్టణ పరిధిలోని అల్లాపూర్‌ గ్రామంలో నరేంద్ర తన మేకలను ఇంటి సమీపంలోని షెడ్‌లో కట్టేసి నిద్రపోయాడు. అర్ధరాత్రి సమయంలో షెడ్‌లోకి చొరబడిన గుర్తుతెలియని దొంగలు, అందులో ఉన్న ఐదు మేకలను అపహరించారు. శుక్రవారం ఉదయం లేచి చూసేసరికి మేకలు కనిపించకపోవడంతో చుట్టుపక్కల వెతికినా ఫలితం లేదు. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ గంగరాజు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement