● చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగ అరెస్టు
● రెండు బైక్‌లు, రెండు సిలిండర్లు స్వాధీనం
తూప్రాన్: జైలుకెళ్లొచ్చినా తీరు మార్చుకోకుండా మళ్లీ నేరాల బాట పట్టిన అంతర్రాష్ట్ర దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి రెండు మోటార్ సైకిళ్లు, రెండు గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం సీఐ వెంకట రాజాగౌడ్ కేసు వివరాలు వెల్లడించారు. స్థానిక ప్రాంతాల్లో కొన్ని రోజులుగా తాళం వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని వరుస దొంగతనాలు జరుగుతున్నాయి. సూర్యపేట జిల్లా మఠంపల్లి గ్రామానికి చెందిన మామిడి శ్రీకాంత్(31) ఇటీవల దొంగతనం కేసుల్లో ఖమ్మం జైలు నుంచి విడుదలై తూప్రాన్‌కు వచ్చినట్లు తెలిపారు. ఈ క్రమంలోనే శని, ఆదివారాల్లో పట్టణంలో స్కూటీ, రెండు సిలిండర్లు చోరీ చేశాడు. దీనిపై ప్రత్యేక నిఘా ఉంచిన పోలీసులు, అనుమానాస్పదంగా తిరుగుతున్న మామిడి శ్రీకాంత్‌ను అదుపులోకి తీసుకొని విచారించారు. విచారణలో అతను వివిధ రాష్ట్రాల్లో చోరీలకు పాల్పడిన అంతర్రాష్ట్ర దొంగగా తేలింది. సదరు నిందితుడు గతంలో కూడా ఆంధ్ర, తెలంగాణలో పలు చోట్ల దొంగతనాలు చేసి, జైలు జీవితం అనుభవించినట్లు పోలీసులు తెలిపారు. కేసును ఛేదించడంలో ప్రతిభ కనబరిచిన ఎస్‌ఐ గంగరాజు, సిబ్బంది మహేశ్, కృష్ణ, గోవర్ధన్, సురేశ్, రాజును సీఐ అభినందించారు.


