● బస్సు రాక విద్యార్థుల ఇక్కట్లు
● నిత్యం కిలోమీటర్లు నడవాల్సిన పరిస్థితి
శివ్వంపేట(నర్సాపూర్): గ్రామానికి మెరుగైన రోడ్డు ఉన్నప్పటికీ ఆర్టీసీ బస్సు రాకపోవడంతో విద్యార్థులు, గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. మండల పరిధిలోని సికింద్లాపూర్ గ్రామానికి డబుల్ రోడ్డు ఉన్నప్పటికీ బస్సు సదుపాయం లేకపోవడంతో నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న గోమారం ఉన్నత పాఠశాలకు విద్యార్థులు నిత్యం నడుచుకుంటూ వెళ్తున్నారు. గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని పలుమార్లు ఆర్టీసీ అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా విద్యార్థులు గోమారం, నర్సాపూర్ తదితర ప్రాంతాలకు వెళ్లేందుకు అవస్థలు పడుతున్నారు. గోమారం గ్రామం వరకు వస్తున్న ఆర్టీసీ బస్సులను సికింద్లాపూర్ గ్రామం వరకు పొడిగిస్తే ఇబ్బందులు తొలగిపోనున్నాయి. ఇప్పటికై నా ఆర్టీసీ అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవాలని విద్యార్థులు, గ్రామస్తులు కోరుతున్నారు.


