● మా తండ్రిని బాగా చూసుకుంటాం ● అధికారులకు హామీ పత్రం రాసిచ్చిన కుమారులు
శివ్వంపేట(నర్సాపూర్): బిడ్డలు బువ్వ పెడ్తలేరని సోమవారం శివ్వంపేటలో నిర్వహించిన ప్రజావాణిలో వృద్ధుడు ఫిర్యాదు చేయడంతో అధికారులు స్పందించారు. మండల పరిధిలోని నవాబుపేట గ్రామానికి చెందిన వృద్ధుడు మహబూబ్ బేగ్ కొడుకులు, కూతుళ్లు ఉన్నా.. పట్టించుకోవడం లేదని చెప్పడంతో ఇందుకు సంబంధించి మీడియాలో మంగళవారం కథనాలు వచ్చాయి. జిల్లా అధికారుల ఆదేశాల మేరకు ఐసీడీఎస్ సూపర్‌వైజర్ లక్ష్మీనర్సమ్మ గ్రామానికి చేరుకుని వివిధ ప్రాంతాల్లో ఉన్న కొడుకులను పిలిపించి మాట్లాడారు. ఉపాధి కోసం వివిధ చోట్లలో నివాసం ఉన్నామని, తమ దగ్గర మా తండ్రి ఉండేందుకు ఇష్టపడరన్నారు. పుట్టిన గ్రామంలోనే ఉంటానని చెప్పడంతో ఇక్కడ ఉంచాల్సి వచ్చిందని కొడుకులు చెప్పారు. గ్రామంలో శిథిలావస్థకు చేరిన సొంతింటికి మరమ్మతులు చేయించి, తండ్రి బాగోగులు చూసుకుంటామని కొడుకులు హామీపత్రం రాసి ఇచ్చారు. ఆమె వెంట అంగన్‌వాడీ టీచర్ రమాదేవి పాల్గొన్నారు.


