కొల్చారం(నర్సాపూర్): వ్యవసాయ బోర్ల వద్ద కేబుల్‌వైర్లు, ట్రాన్స్‌ఫార్మర్లను పగులగొట్టి ఆయిల్, కాపర్‌వైర్‌ను అపహరిస్తున్న ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం పోలీస్ స్టేషన్‌లో మెదక్ రూరల్ సీఐ రాజశేఖర్ రెడ్డి కేసు వివరాలు వెల్లడించారు. కొల్చారంతో పాటు పాపన్నపేట, కౌడిపల్లి మండలాల్లో ఇటీవల కేబుల్ వైర్ చోరీకి సంబంధించి రైతులు ఆయా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసులు నమోదయ్యాయి. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి పాపన్నపేట మండలానికి చెందిన ఐదుగురిని, కొల్చారానికి చెందిన ఒక వ్యక్తిని పట్టుకొని విచారించగా నేరం అంగీకరించారు. నిందితుల్లో పాపన్నపేట మండలం నాగ్సన్‌పల్లి గ్రామానికి చెందిన వడ్డెర దుర్గాప్రసాద్, వడ్డెర మల్లేశం, గ్యారంగుల శివకుమార్, దుర్గేశ్, మండల కేంద్రానికి చెందిన వడ్డే శేఖర్, వడ్డే మహేశ్ ఉన్నట్లు తెలిపారు. నిందితులను మెదక్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పరిచారు.


