ఇక్రిసాట్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ హిమాన్షు పాఠక్
ములుగు(గజ్వేల్): ఆగ్రోఫారెస్ట్రీ సాధనకు పర్యావరణం, సాంకేతికత, ఆవిష్కరణ మూల స్తంభాలుగా నిలుస్తాయని ఇక్రిసాట్(ఐసిఆర్‌ఐఎస్‌ఎటి) డైరెక్టర్ జనరల్ డాక్టర్ హిమాన్షు పాఠక్ అన్నారు. ములుగు అటవీ కళాశాల పరిశోధన సంస్థలో సిల్వర్ కల్చర్, ఆగ్రోఫారెస్ట్రీ ఆధ్వర్యంలో‘ క్లైమేట్ రెడీ ఆగ్రోఫారెస్ట్రీ’ ఇంటిగ్రేటెడ్ ఎకాలజీ, టెక్నాలజీ ఇనిస్టిట్యూషనల్ ఇన్నోవేషన్ అంశంపై మంగళవారం నిర్వహించిన జాతీయ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఆగ్రోఫారెస్ట్రీ అభివృద్ధికి ఎఫ్‌సీఆర్‌ఐతో కలిసి పనిచేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. రాష్ట్ర అటవీ అకాడమీ డైరెక్టర్, చార్మినార్ సర్కిల్ చీఫ్ కన్జర్వేటర్ డాక్టర్ ప్రియాంక వర్గీస్ మాట్లాడుతూ.. అటవీ శాఖకు సమాజ అవసరాలకు మధ్య ఆగ్రోఫారెస్ట్రీ ఒక వారధిలా పనిచేస్తుందని తెలిపారు. జీవనోపాధి కోసం అటవీ సంపదపై పడుతున్న భారాన్ని, పంజాబ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఆగ్రోఫారెస్ట్రీ సాధించిన విజయాలను కాంపా సీఈఓ, సీసీఎఫ్ ఎన్.క్షితిజ వివరించారు. అనంతరం వివిధ పరిశోధకులు సమర్పించిన 151 పరిశోధనాంశాలతో కూడిన సెక్టార్ అబ్‌స్ట్రాక్ట్స్ వాల్యూమ్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో కళాశాల డీన్, సదస్సు చైర్‌పర్సన్ బి.ప్రవీణ, రాష్ట్ర చీఫ్ కన్జర్వేటర్, నోడల్ అధికారి సి.శరవణన్, నాబార్డ్ తెలంగాణ ప్రాంతీయ కార్యాలయం జనరల్ మేనేజర్ ఆర్.గణపతి, ఆగ్రోఫారెస్ట్రీ విభాగం అసిస్టెంట్ ఫ్రొఫెసర్ ఎం.చిరంజీవరెడ్డి, రీజా సుందరం తదితరులు పాల్గొన్నారు.


