పరిషత్ సభ్యులు లేకుండా ..
నేడు జిల్లా వ్యాప్తంగా మండల పరిషత్ సమావేశాలు
సంగారెడ్డి జోన్: గ్రామ పరిపాలన వ్యవస్థ బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రతి 45 రోజులకు ఒకసారి మండల పరిషత్తు కార్యాలయాల్లో మండల సాధారణ సర్వసభ్య సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వం సంబంధిత అధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది. మండల పాలకవర్గాలు ముగిసిన నాటి నుంచి ఇప్పటి వరకు పరిషత్ సమావేశాలు నిర్వహించలేకపోయారు. 2024 జూన్ 24న పాలకవర్గ సభ్యుల పదవీకాలం ముగిసింది. కాగా అప్పటి నుంచి ఎన్నికలు నిర్వహించలేదు.
ప్రభుత్వం ఆదేశాలు..
గతంలో ఎంపీపీ అధ్యక్షతన ఎంపీడీవో ప్రతి మూడు నెలలకు ఒకసారి సమావేశం నిర్వహించారు. సమావేశానికి జెడ్పీటీసీతో పాటు ఎంపీపీ, ఎంపీటీసీలు, సర్పంచులు, మండలంలోని వివిధ శాఖల అధికారులతో పాటు గ్రామపంచాయతీ కార్యదర్శులు హాజరయ్యేవారు. పరిషత్ సభ్యుల పదవీకాలం ముగియడంతో జిల్లాలో మండలాల వారీగా ప్రత్యేక అధికారులను నియమించి పరిషత్తు పాలన కొనసాగిస్తున్నారు. అధికారుల నియామకం జరిగినప్పటికీ ఎలాంటి సమావేశాలు నిర్వహించలేదు. పదవి కాలం ముగిసిన రెండేళ్ల తర్వాత బుధవారం సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటి నుంచి సమావేశం నిర్వహించిన 45 రోజుల తరువాత మరోసారి మీటింగ్ నిర్వహించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
సంక్షేమం, సమస్యలపై చర్చ
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన సంక్షేమ పథకాల అమలు, గ్రామాల వారీగా నెలకొన్న సమస్యలపై చర్చిస్తారు. గ్రామాల్లో నెలకొన్న ప్రధాన సమస్యలు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. కీలక సమస్యల పరిష్కారానికి, అభివృద్ధికి తీసుకునే నిర్ణయాలపై తీర్మానాలు చేస్తారు. వీటితో పాటు అధికారుల తీరుపై ప్రశ్నిస్తారు. ఫలితంగా గ్రామ పరిపాలన వ్యవస్థ బలోపేతం అయ్యే అవకాశాలు ఉంటాయి.
సాధారణంగా మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ అధ్యక్షతన కోరం సభ్యులతో నిర్వహిస్తారు. ప్రస్తుతం పరిషత్ సభ్యులు లేకుండానే బుధవారం సమావేశం నిర్వహించనున్నారు. మండల ప్రత్యేక అధికారి తప్పనిసరిగా హాజరు కావాలి. జిల్లా వ్యాప్తంగా 25 మండలాల పరిధిలో 613 గ్రామపంచాయతీలు ఉన్నాయి. మండల కేంద్రాల్లో నిర్వహించే సమావేశాలకు ఆయా గ్రామపంచాయతీల సర్పంచులు హాజరుకానున్నారు.
ఎట్టకేలకు ప్రభుత్వ ఆదేశాలు
అభివృద్ధి, సమస్యలపై చర్చ
అధికారులతో పాటు సర్పంచులు హాజరు
జిల్లాలో 25 మండలాలు,
613 గ్రామపంచాయతీలు


