అదనపు ఎస్పీ విక్రాంత్‌కుమార్ సింగ్
వెల్దుర్తి(తూప్రాన్): పేకాట, బెట్టింగ్, ఆన్‌లైన్ గేమింగ్ వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాలని అదనపు ఎస్పీ విక్రాంత్‌కుమార్ సింగ్ ఆదేశించారు. మంగళవారం వెల్దుర్తి పోలీస్‌స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్‌లోని రికార్డులు, వివిధ రిజిస్టర్లు, కేసు డైరీలు, పెండింగ్ కేసుల వివరాలను పరిశీలించారు. ఆయా కేసుల దర్యాప్తు పురోగతిని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ కేసులను నిబంధనల ప్రకారం త్వరితగతిన పరిష్కరించాలని ఎస్‌ఐ కరుణాకర్‌రెడ్డికి సూచించారు. అనంతరం స్టేషన్ ఆవరణ, లాకప్ గదులు, భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. సిబ్బందితో సమావేశమై స్థానిక శాంతిభద్రతల పరిస్థితిపై సమీక్షించారు. మాదకద్రవ్యాల నిర్మూలనపై ప్రత్యేక దృష్టి సారించాలని, సైబర్ నేరాల నివారణకు ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలన్నారు.


