హుస్నాబాద్‌రూరల్: మండలంలోని పొట్లపల్లి గ్రామానికి చెందిన మార్క రాజమౌలి మంగళవారం వృత్తిలో భాగంగా కల్లు గీసేందుకు తాటి చెట్టు ఎక్కాడు. కల్లు తీసి కిందకు దిగే క్రమంలో మోకు జారీ కిందపడ్డాడు. తోటి గీత కార్మికులు చూసి వెంటనే వాహనంలో హుస్నాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కరీంనగర్‌కు తరలించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం పరిహారం ఇచ్చి ఆదుకోవాలని గీత కార్మిక సంఘం నాయకుడు మార్క అనిల్‌కుమార్ కోరారు.
పటాన్‌చెరు టౌన్: డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడిన వాహనదారులకు సంగారెడ్డి జిల్లా కోర్టు జరిమానా విధించింది. ఈ సంఘటన పటాన్‌చెరు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ట్రాఫిక్ సీఐ శ్యాంసుందర్ రెడ్డి వివరాలు.. సోమవారం నిర్వహించిన డ్రంకెన్‌డ్రైవ్‌లో 13 మంది వాహనదారులను అదుపులోకి తీసుకున్నారు. వీరిని మంగళవారం సంగారెడ్డి కోర్టులో హాజరుపర్చగా 13 మందికి రూ. 16 వేల జరిమానా విధించినట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.
పటాన్‌చెరు టౌన్: గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైన ఘటన బీడీఎల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ విజయ్‌కృష్ణ వివరాల ప్రకారం.. పటాన్‌చెరు మండలం నందిగామ గ్రామ శివారులో ఓ కంపెనీ పక్కన ఉన్న ఖాళీ స్థలంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం మంగళవారం కనిపించింది. స్థానికుల ద్వారా సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతుడి వయస్సు సుమారు 35 నుంచి 40 ఏళ్ల మధ్య ఉంటుందని, అతని కాలికి నల్లదారంతో కట్టిన రాగి ఉంగరం, నడుముకు రెండు వరుసల నల్ల దారం ఉన్నట్లు గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
● మహిళ ఆత్మహత్యాయత్నం
● పోలీసుల కౌన్సిలింగ్
కొండపాక(గజ్వేల్): భర్త నుంచి రావాల్సిన వారసత్వ ఆస్తిని దక్కకుండా చేస్తున్నారని మనస్తాపానికి గురై మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన కుకునూరుపల్లిలో మంగళవారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా.. కుకునూరుపల్లికి చెందిన దివ్య సుమారు 10 ఏళ్ల కింద కొంక సంతోష్‌కుమార్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈ క్రమంలో 2018లో భర్త సంతోష్‌కుమార్‌తో పాటు కుమారుడు చనిపోయారు. అప్పటి నుంచి కుకునూరుపల్లిలో మామ లింగయ్య పేరిట ఉన్న ఆస్తి వారసత్వంగా భర్త నుంచి తనకు రావాల్సి ఉండగా కుటుంబీకులు అడ్డుకుంటున్నారు. ఈ క్రమంలో కోర్టు ద్వారా తీసుకునేందుకు పలుమార్లు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ పొందడానికి అవసరమైన ధ్రువీకరణ పత్రం కోసం గ్రామ పంచాయతీ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా ఇవ్వడం లేదు. దీంతో మంగళవారం మరోమారు జీపీ వద్దకు వెళ్లి కార్యదర్శిని అడిగింది. ఇవ్వకపోవడంతో వెంట తెచ్చుకున్న పురుగుల మందు డబ్బాను పట్టుకొని ఆత్మహత్య చేసుకుంటానని ఇంటికి వెళ్లింది. సమాచారం అందుకున్న పోలీసులు దివ్య ఇంటికి వెళ్లి ఆమె చేతిలో ఉన్న పురుగుల మందు డబ్బాను లాక్కున్నారు. పోలీస్టేషన్‌కు తీసుకెళ్లి సమస్య పరిష్కారం అయ్యేలా చూస్తామని నచ్చజెప్పి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు.
డీఆర్‌డీఓ పీడీ జయదేవ్ ఆర్య
దుబ్బాకటౌన్: ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని జలసిరి పథకం ద్వారా గ్రామాల్లో జలాల పెంపునకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని డీఆర్‌డీఓ పీడీ జయదేవ్ ఆర్య సూచించారు. మంగళవారం దౌల్తాబాద్ ఎంపీడీఓ కార్యాలయంలో ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొనే అవకాశాలు ఉన్నందున ప్రతి గ్రామంలో ఇంకుడు గుంతలు, పొలాల్లో ఫామ్ పాండ్స్, బోరు మోటార్ల వద్ద రీచార్జ్ వెల్స్ నిర్మించేలా చొరవ చూపాలని సూచించారు. జలసిరి కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేసి భూగర్భ జలాల నిల్వలను పెంచాలని కోరారు. కార్యక్రమంలో ప్రత్యేక అధికారి లింగుస్వామి, తహసీల్దార్ చంద్రశేఖర్‌రావు, ఎంపీడీఓ అఫ్జలుద్దీన్, ఎంపీఓ సయ్యద్ గఫూర్, ఎంఈఓ కనకరాజు, మండల వ్యవసాయ అధికారి సాయి కిరణ్, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు శేఖర్‌రెడ్డి, సర్పంచులు, అధికారులు పాల్గొన్నారు.


