పుల్‌కల్(అందోల్): ఎరువులు చల్లడానికి వెళ్లిన యువకుడు ఫిట్స్ (మూర్ఛ వ్యాధి)తో ప్రాణాలు విడిచాడు. ఈ సంఘటన మండల పరిధిలోని కోడూర్‌లో శుక్రవారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా.. గ్రామానికి చెందిన పెద్దబాగు మల్లేశం(31) పొలంలో ఎరువులు చల్లడానికి ఉదయం ఇంటి నుంచి వెళ్లాడు. అతనికి మూర్ఛ వ్యాధి రావడంతో పొలంలోనే పడిపోయాడు. ఆ సమయంలో ఎవరూ చూడకపోవడంతో పొలంలో బురదలో కూరుకుపోయి ఊపిరాడక మృతి చెందాడు. కాగా చాలా సమయం తరువాత చుట్టు ప్రక్కల వారు చూసేసరికి అప్పటికే మృతి చెందాడు. మృతునికి భార్య శివనీల, ఇద్దరు పిల్లలున్నారు. కుటుంబసభ్యులు ఫిర్యాదు చేయకపోవడంతో కేసు నమోదు చేయలేమని పోలీసులు తెలిపారు.
మూర్ఛ వ్యాధితో కూలీ..
హత్నూర( సంగారెడ్డి): మూర్ఛ వ్యాధితో వ్యవసాయ కూలీ మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని కొన్యాల గ్రామ శివారులో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబీకుల కథనం ప్రకారం.. మెదక్ జిల్లా చిలిపిచెడ్ మండలం జగ్గంపేట గ్రామానికి చెందిన మన్నె యాదగిరి(35) రెండు వారాలుగా హత్నూర మండలం కొన్యాల గ్రామంలోని ఓ వ్యక్తి వ్యవసాయం పొలంలో పనులు చేసుకుంటూ ఉపాధి పొందుతున్నాడు. రోజువారి మాదిరిగానే పొలంలో పనిచేయడానికి వెళుతూ యాదగిరి పొలం వద్ద ఒకసారిగా కుప్పకూలాడు. గమనించిన ఇరుగుపొరుగు కూలీలు వెంటనే వెళ్లి చూడగా అప్పటికే మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.


