వన మహోత్సవం!
మొక్కలు నాటే కార్యక్రమానికి వర్షాభావ గండం
నారాయణఖేడ్: వన మహోత్సవ కార్యక్రమం కోసం ఇప్పటికే జిలాలోని ఆయా నర్సరీల్లో భారీగా మొక్కలు పెంచి సిద్ధంగా ఉంచారు. జూన్‌లో ఆశించిన స్థాయిలో భారీ వర్షాలు లేకపోవడం, జూలై ప్రారంభమై రెండు వారాలు కావస్తున్నా వానలు ముఖం చాటేశాయి. ఈ స్థితిలో మొక్కలు నాటితే ఎండిపోయి చనిపోతాయని అధికారులు ఆందోళన చెందుతున్నారు. మొక్కలు నాటి ట్యాంకర్లతో నీరు పోయడం ఆర్థిక భారం కావడానికి తోడు నీటి తడులు సకాలంలో అందని పక్షంలో మొక్కలు చనిపోయే ప్రమాదం ఉంది. నర్సరీల్లో పెంచుతున్న మొక్కలు అలాగే ఉంచినా చాలా మొక్కలు నాటని కారణంగా ఎండిపోయే అవకాశాలున్నాయి.
సర్వం సిద్ధం..కానీ జాడలేని వాన
జిల్లాలో ఈ ఏడాది భారీ ఎత్తున వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటాలని అధికారులు మొక్కలను సిద్ధం చేశారు. రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లా గుర్రంగూడలో సీఎం రేవంత్‌రెడ్డి మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించగానే జూలై మొదటి వారంలో జిల్లాలో వనమహోత్సవం చేపట్టాలని అధికారులు నిర్ధారించారు. సీఎం కార్యక్రమం ప్రారంభించినా వర్షాలు లేని కారణంగా జిల్లాలో పథకం కార్యరూపం దాల్చడంలేదు. జిల్లాలోని 613 నర్సరీల్లో ఉపాధిహామీ పథకం కింద 36లక్షల మొక్కలు పెంచి సిద్ధం చేశారు. గతేడాదికి చెందిన 18 లక్షల మొక్కలు ఉండగా కన్వర్షన్ ద్వారా కొత్తమొక్కల స్థానంలో చేర్చి ఈ ఏడాది 18 లక్షల మొక్కలను పెంచారు. జూలై మొదటి వారంలో వనమహోత్సవం చేపట్టాలని సిద్ధమయ్యారు. కానీ వర్షాల జాడ లేదు. గతేడాది మంచి వర్షాలు కురవడం వల్ల జూలై నెలాఖరు నాటికి లక్ష్యంలో 40% వరకు మొక్కలు నాటడం పూర్తి చేశారు. కానీ ఈ ఏడాది ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కు అనే చందంగా మారింది. వానాకాలం ముగిసిన తర్వాత నాటితే మొక్కలు బతికే పరిస్థితుల్లేవు. ఈ నెలలో భారీ వర్షాలు కురిస్తే తప్ప వనమహోత్సవం ముమ్మరంగా చేపట్టలేని పరిస్థితులు నెలకొన్నాయి.
నాటిన మొక్కకు ట్యాగింగ్
ఈ ఏడాది ఇంటింటికీ మొక్కలు పంపిణీ చేయాలని కూడా అధికారులు నిర్ధారించారు. ప్రజలకు ఉచితంగా పంంపిణీ చేసేందకు వీలుగా ప్రతీ గ్రామంలోనూ, మున్సిపాలిటీ వార్డుల్లోనూ ప్రత్యేక పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలను రూపొందించారు. ఔషధ మొక్కలను కూడా ఈసారి ఎక్కువగా పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఇక నాటిన ప్రతీ మొక్క కూడా బతికేలా చూడాలని క్షేత్రస్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కేవలం ఫొటోలు, రికార్డుల కోసం కాకుండా క్షేత్రస్థాయిలో మార్పు కనిపించాలని సూచించారు. మొక్క నాటడంతోనే సరిపెట్టకుండా ప్రతీ మొక్కను జియో ట్యాగింగ్ చేయాలని నిర్ణయించారు. గ్రామాల్లో నాటిన మొక్కల సంరక్షణ బాధ్యత స్థానిక సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు, పట్టణాల్లో వార్డు అధికారులకు అప్పగించిన సంగతి తెలిసిందే.
రెండో వారం గడుస్తున్నా ముందుకుపడని అడుగు
గతేడాది జూలై చివరి నాటికి 40% పూర్తి
నర్సరీల్లో సిద్ధంగా 36లక్షల మొక్కలు
ఆదేశాలతో అధికారులూ సిద్ధం
పచ్చదనం పెంచాలనే లక్ష్యంతో ప్రభుత్వం నిర్వహించ తలపెట్టిన వన మహోత్సవానికి ఎల్‌నినో గండం అడ్డంకిగా మారింది. ఆశించినస్థాయిలో వర్షాలు లేకపోవడం, చాలా ప్రాంతాల్లో మొక్కలు నాటేందుకు గోతులు తీయకపోవడం తదితర కారణాలతో కార్యక్రమం బాలారిష్టాలను ఎదుర్కొంటుంది.


