7 ఎకరాలు...గంటలో పిచికారీ
● డ్రోన్‌లతో పురుగుమందు పిచికారీ
● ఆధునిక సాంకేతికతను
ఉపయోగించుకుంటున్న రైతులు
● సమయం, కూలీల ఖర్చు ఆదా
జహీరాబాద్ టౌన్: జిల్లాలోని రైతులు ఖరీఫ్ సీజన్‌లో పత్తి, సోయాబిన్, కంది తదితర పంటలను సాగు చేస్తున్నారు. ప్రస్తుతం పంటలకు రైతులు సస్యరక్షణ చర్యలు తీసుకుంటున్నారు. సోయా, పత్తి తదితర పంటల ఎదుగుదల, పూత, కాతతో పాటు కలుపు మొక్కల నివారణ కోసం రైతులు మందులు పిచికారీ చేస్తున్నారు. కూలీల కొరత, పెరిగిన పెట్టుబడులతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కూలీల కొరత అధిగమించడానికి రైతులు డ్రోన్‌ల సహాయంతో పంటలకు మందులను పిచికారీ చేస్తున్నారు. జహీరాబాద్, ఖేడ్ నియోజకవర్గంలో పలువురు రైతులు డ్రోన్ సాంకేతిక పరిజ్ఞాన్ని ఉపయోగించుకుంటున్నారు. కొంతమంది డ్రోన్లు కిరాయికి నడుపుతున్నారు. డ్రోన్లు ఎకరా పంటను కేవలం పది నిమిషాల్లో మందులను పిచికారీ చేస్తుంది. నేరుగా మొక్కలపై మందులను పిచికారీ చేయడం వల్ల మందు వృథా కావడం లేదు. ఇద్దరు కూలీలు పట్టే పనిని ఒక్క డ్రోన్ తక్కువ సమయంలోనే చేసేస్తుంది. మనుషులు మందులు స్ప్రే చేస్తున్నప్పుడు మందు శరీరంపై పడే ప్రమాదం ఉంది, కానీ డ్రోన్ల వల్ల ఈ ప్రమాదం ఉండదు. మందుల వృథా కావు పైగా ఖర్చులు కూడా తగ్గుతుంది.
పంటల సాగులో వ్యయం తగ్గించడం కోసం రైతులు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటున్నారు. ఈ టెక్నాలజీ గ్రామీణ ప్రాంతాలకూ చేరుకుంది. కూలీల కొరత అధిగమించడానికి డ్రోన్ల సాయంతో క్రిమిసంహారక మందులు పిచికారీ చేస్తున్నారు. ఖర్చు తగ్గడంతోపాటు తక్కువ సమయంలో అధిక విస్తీర్ణంలో మందును స్ప్రే చేసేందుకు వెసులుబాటు కలుగుతుంది.
డ్రోన్ ద్వారా పంటలకు మందులను పిచికారీ చేయడం వల్ల ఎంతో ఉపయోగకరంగా ఉంది. తక్కువ సమయంలో అధిక విస్తీర్ణంలో పంటకు మందులు పిచికారీకి అవకాశం ఉంది. తన పొలంలో గంటలోపు 7 ఎకరాల్లో పిచికారీ చేసింది. కూలీలు అయితే రెండు మూడు రోజులు పట్టేది. గంటకు రూ.600 రుపాయల కిరాయి తీసుకోవడంతో ఖర్చు కూడా తగ్గింది.
–మాతంశెట్టి చంద్రశేఖర్,రైతు, హద్నూర్


