● చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలి
● ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ
మునిపల్లి(అందోల్)/రాయికోడ్(అందోల్): బుదేరా నుంచి తక్కడపల్లి బ్రిడ్జితోపాటు గార్లపల్లి, మక్తక్యాసారం నుంచి రాయికోడ్ మండలం సీరూర్ వరకు బీటీ రోడ్లను రూ.150 కోట్లతో అభివృద్ధి చేస్తున్నట్లు మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. మండలంలోని బుదేరా చౌరస్తాలోని ఓ ఫంక్షన్ హాల్‌లో ఆదివారం జరిగిన పార్టీ కార్యకర్తల ముఖ్యసమావేశంలో ఆయన పాల్గొని ఎస్‌ఆర్‌పై అవగాహన కల్పించారు. డిసెంబర్ నాటికల్లా బీటీ రోడ్ల అభివృద్ధి పనులు పూర్తవుతాయన్నారు. ఈ రోడ్ల ఏర్పాటు ద్వారా ప్రయాణికులకు దూరా భారం చాలావరకు తగ్గిపోతుందన్నారు. తక్కడపల్లి, గార్లపల్లి మధ్య బ్రిడ్జి ఏర్పాట్లు త్వరలో పూర్త వుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి చేసిన అభివృద్ధి ప్రజలకు ప్రతీ గ్రామంలో వివరించాలన్నారు. సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించడంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు నిర్లక్ష్యం చేయడంపై మంత్రి అసహనం వ్యక్తం చేశారు. కార్యకర్తలతోనే పార్టీల మనుగడ సాగుతోందని, వారిని నిర్లక్ష్యం చేయకూడదని సీనియర్ నాయకులకు స్పష్టం చేశారు. అనంతరం రాయికోడ్‌లోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్‌లో బీఎల్‌ఏలు, నాయకులకు ఎస్‌ఐఆర్ ప్రక్రియ పూర్తి చేయడంపై దిశానిర్దేశం చేశారు. ఎస్‌ఐఆర్‌పై బీఎల్‌ఏలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సందేహాలుంటే ఎన్నికల కమిషన్ అధికారులను సంప్రదించాలన్నారు. ప్రతీ ఒక్కరు ఎన్యూమరేషన్ ఫారంను నింపి బీఎల్‌ఓలకు విధిగా అందించాలన్నారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థల జిల్లా చైర్మన్ జి.అంజయ్య, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ సిద్దప్ప పాటిల్, మాజీ ఎంపీపీ రాంరెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సతీష్ కుమార్, బుదేరా సర్పంచ్ మల్లేశం, రాయికోడ్ ఏఎంసీ సుధాకర్‌రెడ్డి, తహసీల్దార్ రంగారావు, ఏఎంసీ, ఆలయ కమిటీల చైర్మెన్‌లు సుధాకర్‌రెడ్డి, సతీశ్‌కుమార్, నాయకులు నర్సింహులు, బసవరాజ్ పాటిల్, కేధారినాథ్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


