సంగారెడ్డి టౌన్: కేతకీ సంగమేశ్వర ఆలయంలో సోమవారం ఆరుద్ర నక్షత్ర వేడుకలను పురస్కరించుకుని ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆదివారం ఆలయ ప్రధాన అర్చకులు శివకుమార్‌శర్మ ఓ ప్రకటనలో వెల్లడించారు. స్వామి వారికి అభిషేకం, ప్రత్యేక అలంకరణ కార్యక్రమం, అనంతరం అన్నదాన కార్యక్రమం ఉంటుందని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలన్నారు.
టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు అనిల్‌కుమార్
జహీరాబాద్: ప్రభుత్వ పాఠశాలలను పూర్తిగా నిర్వీర్యం చేసేందుకు రేవంత్ సర్కారు లోలోపల కుట్ర చేస్తోందని తెలంగాణ ప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం(టీపీటీఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు చెకినాల అనిల్‌కుమార్ ఆరోపించారు. జహీరాబాద్ పట్టణంలోని పీవీఆర్ ఫంక్షన్‌హాల్‌లో శేఖాపూర్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె.బిచ్చయ్య పదవీ విరమణ సందర్భంగా ఏర్పాటు చేసిన విద్యా సదస్సుకు ఆయన హాజరై మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయకుండా ప్రైవేటు పాఠశాలలకు విచ్చలవిడిగా అనుమతులిస్తూ ప్రభుత్వ పాఠశాలలను నిర్లక్ష్యం చేస్తోందన్నారు. రాష్ట్రంలో 25వేల ప్రాథమిక పాఠశాలలు ఉండగా వాటిని నాలుగు వేలకు కుదించేందుకు ప్రయత్నించడం సరికాదని హితవు పలికారు. ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ పాఠశాలల పేరిట రూ.21వేల కోట్లను ప్రజాధనాన్ని లూటీ చేస్తోందని విమర్శించారు. ప్రభుత్వ పాఠశాలల్లో వసతులను మెరుగు పరిచి వాటిని బలోపేతం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఆత్మ కమిటీ చైర్మన్ రామలింగారెడ్డి
జహీరాబాద్: నూతనంగా ఎన్నికై న కోహీర్ మండల కాంగ్రెస్ పార్టీ కార్యవర్గం కార్యకర్తలకు అందుబాటులో ఉండి వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరించాలని ఆత్మ కమిటీ చైర్మన్ పి.రామలింగారెడ్డి స్పష్టం చేశారు. కోహీర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సువర్ణ మల్లన్న పాటిల్ ఆధ్వర్యంలో ఆదివారం పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ అధిష్టానవర్గం నిర్ణయం మేరకు పార్టీ నాయకులు, కార్యకర్తలు పార్టీ శ్రేణులను సమన్వయం చేసుకుని ముందుకు సాగాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వివరించాలని, పార్టీని మరింత పటిష్టం చేసే దిశలో పనిచేయాలని సూచించారు.
ఐఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు నర్సింహారెడ్డి
పటాన్‌చెరు టౌన్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై మాజీమంత్రి హరీశ్‌రావు చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటని, ఆయన వెంటనే సీఎంకు క్షమాపణ చెప్పాలని ఐఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు నర్సింహారెడ్డి డిమాండ్ చేశారు. పటాన్‌చెరులో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ..షాబాద్ హంతకుడితో సీఎం రేవంత్‌రెడ్డిని పోల్చడం హరీశ్‌రావుకు ఏమాత్రం తగదన్నారు. ప్రజలు బీఆర్‌ఎస్ పార్టీని తిరస్కరించి ప్రతిపక్షంలో కూర్చోబెట్టినా, ఆ పార్టీ నేతలు ఇప్పటికీ బాధ్యతారహితంగా మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. బీఆర్‌ఎస్ పాలనలో కరీంనగర్ జిల్లాలో న్యాయవాది వామనరావు దంపతులు నడిరోడ్డుపై హత్యకు గురైన ఘటనను గుర్తు చేస్తూ..ఆ సమయంలో సీఎం, హోంమంత్రి ఎందుకు రాజీనామా చేయలేదో హరీశ్‌రావు ప్రజలకు సమాధానం చెప్పాలని ప్రశ్నించారు.


