జోగిపేట(అందోల్): ఆందోల్ కేజీబీవీ పాఠశాలలోనే సరైన మౌలిక వసతులు కల్పించాలని కోరుతూ ఆదివారం కేజీబీవీ విద్యార్థులు అందోలు ప్రధాన రహదారిపై రాస్తారోకోకు దిగారు. అందోలు, వట్‌పల్లికి చెందిన పాఠశాలలు కొనసాగుతుండటంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని విద్యార్థినులు వాపోయారు. వట్‌పల్లి కేజీబీవీ పాఠశాలకు సొంత భవనం లేకపోవడంతో మూడేళ్లుగా ఇక్కడే కొనసాగిస్తున్నారు. అందోలు, వట్‌పల్లి పాఠశాలల ప్రత్యేకాధికారుల మధ్య సమన్వయం లేకపోవడంతో విద్యార్థినులు తమ ఇబ్బందులు రోజు రోజుకు పెరుగుతున్నాయే తప్ప తగ్గడంలేదని ఆగ్రహించిన విద్యార్థినులు అందోలు–సంగారెడ్డి ప్రధాన రహదారిపై రాస్తారోకోకు దిగారు. సెలవురోజు కావడంతో విద్యార్ధినిల తల్లిదండ్రులు పాఠశాలకు రావడంతో వారితో కలిసి ఆందోళనకు దిగడం విశేషం. దీంతో ఇరువైపులా వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.
పాఠశాలలో గొడవలు
ఈ ఏడాది విద్యార్థినుల సంఖ్య పెరగడంతో పాఠశాలలో వసతులు సరిపోక ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. అందోల్ పాఠశాలకు చెందిన 380 మంది వట్‌పల్లి పాఠశాలకు చెందిన 160 విద్యార్థినులకు సరిపోయే సదుపాయాలు వసతులు లేకపోవడం వల్ల తరచూ విద్యార్థినుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. పాఠశాలలో కాలకృత్యాలు తీర్చుకోవడానికి, స్నానాలకు అందోలు పాఠశాల విద్యార్థినులకే మొదటి ప్రాధాన్యతను ఇస్తున్నారని వట్‌పల్లి బాలికలు ఆరోపిస్తున్నారు.
ఎంఈఓ హామీతో..
అందోలు వద్ద కేజీబీవీ విద్యార్థినులు ఆందోళన చేస్తున్న విషయాన్ని తెలుసుకున్న జోగిపేట సీఐ అనిల్ కుమార్, జోగిపేట ఎస్సై శ్రీకాంత్ చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. మండల విద్యాధికారి కృష్ణ పాఠశాలకు చేరుకుని ఆందోల్, వట్‌పల్లి ఎస్‌ఓలతో మాట్లాడి విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తామని తల్లిదండ్రులకు హమీ ఇచ్చారు. దీంతో విద్యార్థినులు ఆందోళనను విరమించారు. పాఠశాలలో సరిపోయే సదుపాయాలు లేవని త్వరలో వట్‌పల్లి పాఠశాలను వేరొక భవనాన్ని ఏర్పాటు చేస్తామని సూచించారు. మంత్రి దామోదర రాజనర్సింహ దృష్టికి ఈ సమస్యలను తీసుకువెళ్లనున్నట్లు ఎంఈఓ తెలిపారు.
ఆందోలు రహదారిపై కేజీబీవీ విద్యార్థ్ధినుల రాస్తారోకో
ఎంఈఓ నచ్చజెప్పడంతో విరమణ
ఒకే భవనంలో రెండు మండలాల పాఠశాలలతో ఇబ్బందులు


