అదనపు కలెక్టర్ పాండు
సంగారెడ్డి టౌన్: ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయడంతోపాటు, ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతంగా ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ పాండు సూచించారు. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా ఆదివారం సంగారెడ్డి మండలంలోని ఇరిగిపల్లి, హనుమాన్‌నగర్, సంగారెడ్డి మున్సిపాలిటీ 28వ వార్డులో ఏర్పాటు చేసిన కేంద్రాలను అదనపు కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఫారాల స్వీకరణ, నమోదు ప్రక్రియ, ప్రజలకు అందిస్తున్న సేవలపై అధికారులు, సిబ్బందికి అవసరమైన సూచనలు చేశారు. ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా, వేగవంతంగా నిర్వహించాలని ఆదేశించారు. ప్రజలు తమ ఓటరు వివరాలను సరిచేసుకునేందుకు, కొత్తగా నమోదు చేసుకునేందుకు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ పరిశీలనలో తహసీల్దార్ జయరాం, వివిధ గ్రామాల సర్పంచులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.


