టెన్త్ విద్యార్థులకు అల్పాహారం
● జిల్లాలో 5,704 మందికి లబ్ధి ● ఇప్పటికే పీఎంశ్రీ స్కూళ్లలో షురూ.. ● ఒక్కో విద్యార్థికి రూ.15 ఖర్చు ● 19 రోజుల పాటు స్నాక్స్
మెదక్ అర్బన్: పది విద్యార్థులకు విద్యాశాఖ అల్పాహారం అందించనుంది. మంగళవారం నుంచి అన్ని పాఠశాలల్లో సాయంత్రం స్నాక్స్ ప్రారంభించాలని డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఇప్పటికే పీఎంశ్రీ స్కూళ్లలో పది విద్యార్థులకు జనవరి 28 నుంచి స్నాక్స్ అందిస్తుండగా, సమగ్ర శిక్ష అభియాన్ స్కూళ్లకు కొత్తగా ప్రారంభించారు. జిల్లాలో ఈ యేడు ప్రైవేటు, రెసిడెన్షియల్ పాఠశాలలకు సంబంధించి మొత్తం 11,247 మంది విద్యార్థులు పది పరీక్షలు రాయనున్నారు.
5,704 మంది విద్యార్థులకు..
మార్చి 14 నుంచి జరగనున్న పదో తరగతి పరీక్షలు దృష్టిలో పెట్టుకొని, విద్యార్థులకు ప్రభుత్వం స్నాక్స్ ఇవ్వాలని నిర్ణయించింది. ఇప్పటికే జిల్లాలో 31 పీఎంశ్రీ పాఠశాలల్లో పది విద్యార్థులకు జనవరి 28 నుంచి స్నాక్స్ అందిస్తున్నారు. కాగా సమగ్ర శిక్ష అభియాన్ కింద 129 పాఠశాలల్లోని 5,704 మంది విద్యార్థులకు స్నాక్స్ అందిస్తున్నారు. ఒక్కో విద్యార్థికి రోజుకు రూ.15 చొప్పున ఖర్చు చేయనున్నారు. మొత్తం 19 రోజుల పాటు స్నాక్స్ అందించనున్నారు. ఇందుకు గాను జిల్లాకు రూ.16,25,640 మంజూరయ్యాయి. కాగా జిల్లాలో 31 పీఎంశ్రీ పాఠశాలలుండగా, ఆ విద్యార్థులకు గత నెల నుంచే అల్పాహారం అందిస్తున్నారు.
ఆకలి బాధ తీరింది
మాది పాపన్నపేట మండలం ఽఎల్లాపూర్. ప్రతి రోజు పొద్దున్నే 7 కిలోమీటర్ల ప్రయాణం చేసి తినకుండానే యూసుఫ్‌పేట స్కూల్‌కు వస్తాను. మధ్యాహ్న భోజనంతోనే సరిపెట్టుకుంటాం. సాయంత్రం స్పెషల్ క్లాస్ సమయానికి ఆకలవుతోంది. దీంతో చదువుపై ధ్యాస ఉండదు. ప్రస్తుతం స్నాక్స్ ఇస్తుండటంతో ఆకలి బాధ తీరింది.
– నేరెల్ల విఘ్నేశ్, 10వ తరగతి, యూసుఫ్‌పేట
టెన్త్ విద్యార్థులకు అల్పాహారం


