జవాబుదారీగా పనిచేస్తేనే గుర్తింపు
మెదక్ కలెక్టర్ రాహుల్‌రాజ్
మెదక్ కలెక్టరేట్: జవాబుదారీగా పనిచేస్తేనే ప్రజల్లో గుర్తింపు ఉంటుందని, సుపరిపాలన అందించేందుకు ఉద్యోగులందరూ కృషి చేయాలని నూతన ట్రైనీ గ్రూప్ 1 అధికారులకు కలెక్టర్ రాహుల్‌రాజ్ పిలుపునిచ్చారు. మెదక్ కలెక్టరేట్‌లో నూతన ట్రైనీ గ్రూప్1 అధికారులతో మంగళవారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... ట్రైనీ అధికారులు శిక్షణ అనంతరం ఉద్యోగ బాధ్యతలలో అవినీతికి తావులేకుండా సుపరిపాలన అందించాలన్నారు. పారదర్శకంగా, జవాబుదారీగా ఉద్యోగం చేసినప్పుడే ప్రజల్లో గుర్తింపు వస్తుందన్నారు. దేశంలో గ్రామీణ వ్యవస్థ చాలా పెద్దదని, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజల అభివృద్ధే దేశాభివృద్ధి అన్నారు. అధికారులు సేవల్లో తమ చుట్టూ ఉన్న వనరులను ఉపయోగించుకోవాలని సూచించారు. ఉద్యోగ సేవల్లో టెక్నాలజీని కూడా ఉపయోగించాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేశ్, జెడ్పీసీఈఓ ఎల్లయ్య, డీఆర్డీఓ పీడీ శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.
మామిడికి కవర్లు
రక్షణ కవచం
ఉద్యానశాఖ జిల్లా అధికారి సోమేశ్వర్‌రావు
జహీరాబాద్ టౌన్: కాయలకు కవర్లు కట్టడం వల్ల మామిడికి రక్షణ కవచంలా ఉంటుందని ఉద్యానశాఖ జిల్లా అధికారి సోమేశ్వర్‌రావు పేర్కొన్నారు. కోహీర్ మండలంలోని బిలాల్‌పూర్, కోహీర్ మామిడి రైతులకు మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ఇటీవల కాలంలో మామిడికి తెగుళ్ల బెడద తీవ్రంగా వేధిస్తోందన్నారు. నల్లతామర, పండుఈగ, తేనె మంచు, మసి తెగులు, బంక తెగుళ్ల నుంచి కాయలను కాపాడుకునేందుకు రక్షణ కవర్లను కడుతున్నారని చెప్పారు. నిమ్మకాయ సైజులు వచ్చినప్పుడు కాయలకు కవర్లు కట్టాలన్నారు. తెగుళ్ల బాధకూడా తగ్గుతుందన్నారు. మామిడిలో తెగుళ్ల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా ఆయన రైతులకు వివరించారు.
తునికి ఎంజేపీ విద్యార్థికి
91.2 పర్సంటైల్
కౌడిపల్లి(నర్సాపూర్): మండలంలోని తునికి వద్దగల ఎంజేపీ (మహాత్మ జ్యోతిబాపూలే) బీసీ గురుకుల కళాశాల విద్యార్థి జేఈఈ మెయిన్స్‌లో 91.2 పర్సంటైల్ సాధించి సత్తాచాటాడు. కొల్చారం మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన కన్నెబోయిన విజయ్‌కుమార్ ప్రస్తుతం తునికి ఎంజేపీలో కొనసాగుతున్న కౌడిపల్లి ఎంజేపీ కళాశాలలో ఎంపీసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. కాగా, గత నెలలో విజయ్‌కుమార్ జేఈఈ మెయిన్స్ పరీక్ష రాయగా 91.2పర్సంటైల్ సాధించాడు. విజయ్‌కుమార్ తల్లిదండ్రులు శేఖులు, లక్ష్మి సాధారణ వ్యవసాయ కుటుంబం. ప్రభుత్వ పాఠశాలలో చదివి జేఈఈలో మంచి ఫలితం సాధించడంతో కళాశాల ప్రిన్సిపాల్ హరిబాబు, లెక్చరర్లు అతన్ని శాలువాతో సన్మానించారు. భవిష్యత్తులో చదువులో మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆశీర్వదించారు.
తొలగించిన చెప్పుల కుప్పలు
రాజగోపురం ఎదుట నుంచి
స్టాల్‌లోకి మార్చిన సిబ్బంది
పాపన్నపేట(మెదక్): ‘దుర్గమ్మా ఇదేం దుర్గతి’శీర్షికన మంగళవారం ‘సాక్షి’ప్రచురించిన కథనానికి ఆలయ, పంచాయతీ అధికారులు స్పందించారు. ఆగమేఘాల మీద రాజగోపురం ఎదురుగా ఉన్న చెప్పుల కుప్పలను సిబ్బంది తొలగించారు. చెప్పుల స్టాండ్ కోసం నిర్మించిన హాల్‌ను వినియోగంలోకి తెచ్చారు. భక్తుల పాదరక్షలు చెప్పుల స్టాండ్‌లో భద్రపరిచారు. ఒక్కో జతకు రూ.40 చొప్పున వసూలు చేశారు. దీంతో రాజగోపురం ముందు.. దుర్గమ్మ ఆలయానికి ఎదురుగా ఉన్న ప్రధాన వీధి శుభ్రంగా మారింది. అలాగే శివాలయం ముందు పక్కన గల ఎంగిలి విస్తారాకుల పెంటను కూడా తొలగించి, దేవాలయ ప్రాంగణాన్ని పవిత్రతకు ప్రతీకగా తీర్చిదిద్దారు.
జవాబుదారీగా పనిచేస్తేనే గుర్తింపు
జవాబుదారీగా పనిచేస్తేనే గుర్తింపు


