అదృశ్యమైన వ్యక్తి శవమై కనిపించాడు
వట్‌పల్లి(అందోల్): అదృశ్యమైన ఓ యువకుడు శవమై కనిపించిన ఘటన బుధవారం మండల కేంద్రంలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. ఏపీలోని నెల్లూరు జిల్లా విడవలూరు మండలం పొన్నపుడి కొత్తూరుకి చెందిన డమ్ము వెంకటేశ్(31) కుటుంబం 8ఏళ్ల క్రితం వట్‌పల్లికి వచ్చి ఓ అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. వెంకటేష్ రోజువారి కూలీగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో జనవరి 31న తెల్లవారు జామున కుటుంబ సభ్యులకు చెప్పకుండా బయటకు వెళ్లి తిరిగి రాలేదు. బుధవారం సాయంత్రం వారు నివాసం ఉంటున్న ఇంటి పక్కనే నిర్మాణంలో ఉన్న ఓ భవనంలో నుంచి దుర్వాసన రావడంతో అక్కడికి వెళ్లి చూడగా.. భవనం లిఫ్ట్ గుంత నీటిలో ఓ వ్యక్తి మృతి చెందినట్లుగా గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఎస్‌ఐ లవకుమార్, ఎస్‌ఐ–2 శ్రీహరితో పాటు పోలీసు సిబ్బంది అక్కడికి చేరుకొని పరిశీలించి మృతదేహాన్ని బయటకు తీశారు. మృతదేహాన్ని పరిశీలించగా ఈనెల 31న అదృశ్యమైన డమ్ము వెంకటేష్‌గా గుర్తించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జోగిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.


