కదం తొక్కిన కార్మికలోకం
జిల్లావ్యాప్తంగా కార్మిక చట్టాలపైవెల్లువెత్తిన నిరసనలు సంగారెడ్డిలో భారీ ర్యాలీ శ్రమదోపిడీకి చట్టబద్ధత: సీఐటీయూ చుక్కా రాములు జహీరాబాద్‌లో కార్మిక సంఘాలనాయకుల అరెస్టు
సంగారెడ్డి ఎడ్యుకేషన్/జహీరాబాద్ టౌన్/వట్‌పల్లి(అందోల్): కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నూతన లేబర్ కోడ్‌లపై కార్మికలోకం కదం తొక్కింది. కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు వామపక్ష పార్టీలు ఇచ్చిన దేశవ్యాప్త సమ్మె పిలుపు మేరకు గురువారం సంపూర్ణబంద్‌ను నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున కార్మికులు రోడ్లపైకి వచ్చి తమ గళాన్ని వినిపించారు. సీఐటీయూతోపాటు అన్ని రంగాల కార్మికుల ఆధ్వర్యంలో సంగారెడ్డిలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్కా రాములు మాట్లాడారు. హైర్ అండ్ ఫైర్‌తో శ్రమ దోపిడీకి చట్టబద్ధత కల్పించడమేనని నూతన కార్మిక చట్టాలను అభివర్ణించారు. ఇప్పటివరకు ఉన్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి, కార్మికులను మరింతగా దోచుకునే విధంగా లేబర్ కోడ్‌లను రూపొందించారన్నారు. రాష్ట్రాల్లో ఉన్న కార్మిక సంక్షేమ బోర్డులను రద్దు చేసి, కార్మికుల విద్య, వైద్యం, వివాహ, ప్రసూతి సహాయాలను నిలిపివేయడానికి ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా వట్‌పల్లిలో కార్మికులు చేపట్టిన ఆందోళనకు సీఐటీయూ జిల్లా నాయకులు ఎర్రొళ్ల మహేశ్ హాజరై కార్మికులకు మరణ శాసనంగా తెచ్చిన నాలుగు లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
జహీరాబాద్‌లో నాయకుల అరెస్టు
లేబర్ కోడ్‌లు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ దేశ వ్యాప్త సమ్మెలో భాగంగా జహీరాబాద్‌లో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కార్మికులు నిర్వహించిన ఆందోళన ఉద్రిక్తమైంది. బస్టాండ్ వద్ద రాస్తా రోకో నిర్వహించడంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలగడంతో పోలీసులు ఆందోళనకారులను అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు. కార్మికులు పరిశ్రమల గేట్ల ముందు బైఠాయించి ధర్నాలు నిర్వహించారు. సీఐటీయూ ఆధ్వర్యంలో పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రకాశ్‌రావు, సీఐటీయూ నాయకులు బీరం మల్లేశం, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.


