టిక్‌టిక్.. టిక్‌టిక్
తేలనున్న అభ్యర్థుల భవితవ్యం
జిల్లాలో 11 కౌంటింగ్ కేంద్రాలు
ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
256 వార్డులు.. 350 కౌంటింగ్ టేబుళ్లు
సంగారెడ్డి జోన్: మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై నెలకొన్న ఉత్కంఠకు మరికొన్ని గంటల్లో తెరపడనుంది. మరికొద్దిసేపట్లో ప్రారంభం కానున్న ఓట్ల లెక్కింపునకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుంది. కొన్ని గంటల వ్యవధిలోనే ఫలితాలు వెల్లడయ్యే అవకాశం కనిపిస్తోంది. ఓటింగ్ పూర్తయిన రోజే బ్యాలెట్ బాక్సులను ఆయా మున్సిపాలిటీల వారీగా స్ట్రాంగ్ రూములకు తరలించారు.
1000 ఓట్లకు ఒక టేబుల్
ప్రతీ 1000 ఓట్లకు ఒకటి చొప్పున మొత్తం 350 టేబుళ్లను సిద్ధం చేశారు. ప్రతీ కౌంటింగ్ టేబుల్ దగ్గర ఒక కౌంటింగ్ పర్యవేక్షకాధికారి, ఇద్దరు అసిస్టెంట్ కౌంటింగ్ సూపర్‌వైజర్లు ఉంటారు. వీరు మొత్తంగా 420 కౌంటింగ్ పర్యవేక్షకాధికారులు, 840 అసిస్టెంట్ సూపర్ వైజర్‌లను నియమించారు. అదేవిధంగా ప్రతీ మూడు టేబుళ్లకు ఒక రిటర్నింగ్ అధికారి, ఒక అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి చొప్పున 186 మందిని నియమించారు. వీరితోపాటు సామగ్రి సరఫరా చేసేందుకు అవసరం మేరకు సిబ్బందిని నియమించారు. అభ్యర్థి లేదా ఆయన తరుఫున ఎలక్షన్ ఏజెంట్‌తోపాటు ప్రతీ టేబుల్‌కు ఒక కౌంటింగ్ ఏజెంట్‌ను లోపలికి అనుమతిస్తారు. మొదటగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కించిన అనంతరం పోలింగ్ ఓట్లు లెక్కిస్తారు.
నేడే కౌంటింగ్


